భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయనే ఉపశమనం కలుగుతున్నా.. ఈ వైరస్ కారణంగా నమోదువుతున్న మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. మూడున్నర లక్షలు కేసులు నమోదైన సమయంలో 5 వందల లోపు ఉన్న రోజువారీ కరోనా మరణాలు.. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన సమయంలో 1000 చేరువ అవుతున్నాయి.
తాజాగా 959 మరణాలు సంభవించాయి. అయితే.. రోజువారీ కేసులు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు 2,09,918 మంది కరోనా బారిన పడ్డారు. రికవరీ కేసులు కూడా పెరగడం ఉపశమనం కలిగిస్తుంది. కొత్తగా 2,62,628 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,13,02,440 కి చేరగా.. అందులో 3,89,76,122మంది రికవరీ అయ్యారు.
ఇప్పటివరకు వైరస్ ధాటికి 4,95,050 మంది మృతి చెందగా.. ఇంకా 18,31,268 చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం 28,90,986 డోసులు అందించగా.. ఇప్పటి వరకు 166,03,96,227 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.