బంగారం ధర ఊహించని విధంగా రూ.2,000 దాకా పడిపోయింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది.
హైదరాబాద్: అంతర్జాతీయ బలహీన సంకేతాలు, రూపాయి బలపడటం వల్ల ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గురువారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.2 శాతం తగ్గుదలతో రూ.37,877కు క్షీణించింది. బంగారం ధర గత వారపు గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ఇప్పుడు రూ.2,000 తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర గురువారం 0.60 శాతం క్షీణతతో రూ.47,518కు తగ్గింది. గత వారపు గరిష్ట స్థాయి రూ.51,489తో పోలిస్తే వెండి ధర దాదాపు రూ.4,000 పతనమైంది.
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.2 శాతం క్షీణతతో 1,493.65 డాలర్ల వద్ద ఉంది. ఈక్విటీ మార్కెట్లలో స్థిరత్వం, అమెరికా బాండ్ ఈల్డ్ పెరగడం కారణంగా బంగారం ధర గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తోందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. కేంద్ర బ్యాంకుల సరళ విధానాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు వంటి అంశాలు కూడా ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. దేశీ మార్కెట్‌కు బంగారం ధరల తగ్గుదల కలిసొచ్చే అంశామని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. పసిడి పడిపోవడంతో జువెలరీ డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది.