ఈమధ్య జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గోల్ కీపర్ శ్రీజేష్ ని ఓ ప్రశ్న అడిగారు. విజయం తర్వాత గోల్ పోస్ట్ పైకి ఎలా ఎక్కారని ప్రశ్నించారు. దానికి శ్రీజేష్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. గోల్ పోస్ట్ ను తన ఇల్లుగా అభివర్ణించాడు. 21 ఏళ్లుగా దాని ముందు నిలబడి ఉన్నానని చెబుతూ.. గెలిచిన ఉత్సాహంతో ఒక్క దూకు దూకి గోల్ పోస్ట్ మీద కూర్చుకున్నానని వివరించాడు.
ఒలింపిక్స్ లో జర్మనీతో జరిగిన మ్యాచ్ లో గెలిచి కాంస్యం దక్కించుకుంది భారత్. 41 ఏళ్ల తర్వాత పతకాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. మ్యాచ్ చివరిలో టీమిండియాతో పాటు భారత్ అభిమానులకు ఒకటే టెన్షన్. అందరీ చూపు గోల్ కీపర్ శ్రీజేష్ వైపే ఉంది. టీమిండియాకు ఎన్నో అపురూప విజయలు అందించిన అతను.. ఈ ఒక్క గోల్ ఆపాలని అందరూ ప్రార్థించారు. అందరూ కోరుకున్నట్లుగా జర్మనీ ఆటగాడు బలంగా కొట్టిన బంతిని శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత గెలిచామన్న ఆనందంలో గోల్ పోస్టు పైకి ఎక్కాడు. ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అసలు అక్కడకు ఎలా ఎక్కాడో తెలుసుకోవాలని ప్రధాని మోడీకి కూడా అనిపించింది. అందుకే అతడితో సమావేశమైనప్పుడు దీన్ని ప్రస్తావించారు.