కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మతం ఆధారంగా ఎవరిపై వివక్ష చూపదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో తాను ఒకసారి చెప్పినట్టు కేంద్ర మంత్రి వివరించారు.
పూణెలోని సిన్హాబాద్ లో ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో శివసేన-బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా తాను ఉన్నప్పుడు రతన్ టాటాతో జరిగిన సంభాషణను ఆయన వివరించారు.
ఆర్‌ఎస్‌ఎస్ దివంగత చీఫ్ కేబీ హెడ్గేవార్ పేరుతో గతంలో ఔరంగాబాద్‌లో ఆస్పత్రిని నిర్మించారని చెప్పారు. ఆ సమయంలో తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నానని తెలిపారు. అయితే ఆ ఆస్పత్రిని పారిశ్రామిక వేత్త రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు తనను కోరినట్టు చెప్పారు.
దీంతో తాను రతన్ టాటాను సంప్రదించినట్టు పేర్కొన్నారు. అప్పుడు ఆ ఆస్పత్రికి కేవలం హిందువులకు మాత్రమే చికిత్స అందిస్తుందా అని తనను అడిగినట్టు వివరించారు. మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందని టాటాను తాను ప్రశ్నించినట్టు చెప్పారు.
దానికి వెంటనే ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ ఆస్పత్రి కదా అని రతన్ టాటా బదులిచ్చారని చెప్పారు. దీనిక తాను స్పందించి…
ఆస్పత్రి అన్ని వర్గాలకు చెందినదని, ఆర్‌ఎస్‌ఎస్‌లో మత ప్రాతిపదికన వివక్ష జరగదని ఆయనకు చెప్పానన్నారు. ఆ తర్వాత పలు విషయాలను రతన్ టాటాకు వివరించానన్నారు.