– “పైగా” భూములపై కన్నేసిన లీడర్లు
– కోర్టు కేసులున్నా కబ్జాలు
– గుట్టంతా బయటపెట్టిన తొలివెలుగు
– దెబ్బకు దిగొచ్చిన అధికారులు
– హైదర్ నగర్ భూముల్లో కూల్చివేతలు
తొలివెలుగు దెబ్బకు గొల్ట్‌స్టోన్ అనుచరులు గూబ గుయ్ అంటోంది. కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా కొట్టేసేందుకు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో వివరంగా కథనాలు రాస్తుండడంతో వణికిపోతున్నారు. కబ్జాల గుట్టంతా నెంబర్లతో సహా వివరంగా చెబుతుండడంతో అధికారుల్లో సైతం చలనం వచ్చింది. కూకట్ పల్లి హైదర్ నగర్ సర్వే నెంబర్ 163లో సుమారు 150 ఎకరాలు కబ్జాకు స్కెచ్ గీసింది గోల్డ్‌స్టోన్ గ్యాంగ్. బీడీబీ సైబర్ సిటీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ ఉందని భూమి చుట్టూ ఇనుప రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జా పెట్టింది.
హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూములపై సివిల్ సూట్ 14/58 కేసు కొనసాగుతోంది. “పైగా” భూముల్లో 6 దశాబ్దాలుగా వివాదం ఉంది. అయితే కోర్టుల్లో కేసు విచారణ జరుగుతుండగానే.. భూమి మాత్రం మిగలడం లేదు. ఇలా ఇప్పటికే 5 వేల ఎకరాల్లో బిల్డింగులు వెలిశాయి. గోకుల్ ప్లాట్స్ వంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ లేకుండానే అయిదారంతస్తులు వెలుస్తుండటం కామన్‌గా మారిపోయింది. వీటన్నింటిపై తొలివెలుగు పూర్తి స్థాయిలో కథనాలు ఇచ్చింది. లోకల్ లీడర్స్ అండదండలతో పక్కా సర్వే నెంబర్ వేసుకొని “పైగా” భూములను కబ్జా చేస్తున్నారని అన్ని వివరాలు సవివరంగా రాసింది.
తొలివెలుగు కథనాలతో వెలుగులోకి కబ్జా బాగోతాలు
హఫీజ్‌పేట్ ల్యాండ్స్‌తో పాటు చాలా భూములు సీఎస్ 14/58, సీఎస్ 7/58, 9/58 కేసుల్లో ఉండగానే కబ్జాలు జరిగిపోతున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ తన క్రిమినల్ బ్రెయిన్‌తో వేల కోట్లు సంపాదించాడు. ఈ క్రమంలోనే ఎవరికి దొరకకుండా అతను దాక్కుంటున్నాడని తొలివెలుగు కథనాలు రాసింది. సర్వే నెంబర్ 172లో ప్లాట్ల రూపంలో ఎప్పుడో కొనుగోలు చేసిన వారికి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని బాధితుల బాధలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇలా మొత్తం 10 వేల ఎకరాల్లో పాగా వేసేందుకు కుట్రలు పన్నిన గోల్డ్ స్టోన్ గ్యాంగ్ ఆటలు కట్టించేందుకు తొలివెలుగు అన్ని కోణాల్లో వార్తలు రాసి ప్రజల ముందు ఉంచింది.
ఫిర్యాదు ఇలా..
సీఎస్ 14లో డిఫెండెంట్ 109గా ఉన్న హున్నిసా బేగం వారసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.139/1971లో భాగంగా వీరికి భూమి కేటాయించారు. ఇందుకు ఓఎస్ నెంబర్ A1/1985లో తుది టైటిల్ కోసం న్యాయపరంగా పోరాడుతున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇలాంటి వారిని పూర్తిగా నిర్వీర్యం చేసి భూమి కబ్జా పేట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారో.. ఎలా చేస్తున్నారో తెలియకుండానే బిల్డింగులు పూర్తి అయిపోతున్నాయి. అందుకు అధికారులకు గులాబీ నోట్లతో ఆశలు చూపించి.. ఎవ్వరు అడగకుండా నోర్లు మూయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలివెలుగు నిజాలను నిర్భయంగా రాసి.. అధికారులకు, సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే విధంగా కథనాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భూములను కాపాడేందుకు అందరూ ముందుకొస్తున్నారు. తుది తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వ భూమిగానే చూసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని భావిస్తున్నారు. ఎట్టకేలకు అధికారులు తొలివెలుగు కథనాలతో కదిలి.. ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను కూల్చివేశారు.