– శవాలపై కాసులు ఏరుకునే బ్యాచ్ కు చెక్
– బెదిరింపులకు సైతం పాల్పడిన ముఠా
– తొలివెలుగు కథనంతో ఉన్నతాధికారుల చర్యలు
వరంగల్, తొలివెలుగు:ఆస్పత్రుల్లో ప్రాణం ఉండగానే రక్తం తాగే వాళ్ళు కొందరైతే.. చనిపోయాక శవాలపైన కాసులు ఏరుకునే బ్యాచ్ మరికొందరు. బతికున్న మనిషైనా.. శవమైనా తమకు ఒకటే అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కానీ, మార్చురీలో జరుగుతున్న యదార్థ సంఘటనలను తొలివెలుగు బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. వందే భారత్ రైలు ఢీకొని మహబూబాబాద్ జిల్లా దాట్లకు చెందిన పస్తం శ్రీను అనే వ్యక్తి చనిపోయాడు. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చారు. శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబాన్ని చూసి జాలి చూపకుండా.. మార్చురీలో గత 25 ఏళ్ల నుండి తిష్ట వేసిన ఓ ప్రైవేట్ ఫోటో గ్రాఫర్, జీఆర్పీ కానిస్టేబుల్ పోస్ట్ మార్టం చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు.
రాబందుల మాదిరి ఆ కుటుంబాన్ని పీక్కు తిన్నారు. పొట్ట కూటి కోసం కూలీ పని చేసుకొని బతికే కుటుంబం అని చెప్పినా వినకుండా రూ.15 వేలు డిమాండ్ చేశారు. తమ వద్ద రూ.200 కూడా లేవని చెప్పినా కనికరించలేదు. చివరకు చేసేదేమీ లేక బాధిత కుటుంబం అడిగిన డబ్బులు ఇచ్చేసింది. అప్పటికే 3 రోజుల నుండి వరంగల్ ఎంజీఎం మార్చురీపై నిఘా పెట్టిన తొలివెలుగు కెమెరాలకు ఆ రాబందులు అడ్డంగా దొరికిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా శవాలతో కాసుల వ్యాపారం చేస్తున్న వీరి బండారాన్ని తొలివెలుగు బయట పెట్టింది.
ఒకటి కాదు.. రెండు కాదు ఎంజీఎంలో పోస్ట్ మార్టం నిమిత్తం ఎవరిని తీసుకొచ్చినా వీళ్లకు పండగే. అడిగేది ఎవరు? అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విషయం బయటపడ్డాక.. తాము ఇన్ని రోజులు చేసింది దేశానికి సేవ అన్నట్టుగా తొలివెలుగుపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, తొలివెలుగు ఎవరికీ అదరదు.. బెదరదు. వీళ్ల బండారం మొత్తం ప్రజల ముందు ఉంచింది. నిద్ర మత్తులో నుండి తేరుకున్న ఫోరెన్సిక్ ఇంచార్జ్ కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.మోహన్ దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ హుటాహుటిన ఎంజీఎం మార్చురీలో జరిగిన పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రైవేట్ ఫోటో గ్రాఫర్ ను ఎంజీఎం నుండి నిషేధించారు.
అంతేకాకుండా (రైల్వే) జీఆర్పీ పోలీసులకు సంబంధిత కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖ రాసారు. ఇందులో ఫోరెన్సిక్ డాక్టర్ల చేతివాటంపై కూడా విచారణ చేపట్టడమే కాకుండా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ, తగు సూచనల బోర్డ్ లు కూడా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. మొత్తానికి గత 25 సంవత్సరాల నుండి ఎంజీఎం మార్చురీలో శవాలపై కాసుల పండుగ చేసుకుంటున్న రాబందుల నుండి ఎంజీఎం మార్చురీకి విముక్తి కలిగిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.