– తొలివెలుగు కథనాలతో బయటపడ్డ ఫినిక్స్ కబ్జాలు
– భూ బాగోతాలపై అధికారుల ఆరా
– రంగంలోకి హెచ్ఎండీఏ కమిషనర్
– రూట్ సొసైటీ, ప్రభుత్వ భూముల పరిశీలన
– జూబ్లీహిల్స్ భూముల దందాపై స్పెషల్ ఫోకస్
– కట్టడాలు కూల్చకుండా పైరవీలు చేస్తున్న ఫినిక్స్
తొలివెలుగు దెబ్బకు అక్రమాల ఫినిక్స్ చుక్కపల్లికి చుక్కలు కనపడుతున్నాయి. నగరంలో ఇప్పటిదాకా జరిపిన, జరుగుతున్న భూ దందాలపై మ్యానేజ్ చేస్తూ వస్తోంది ఫినిక్స్ సంస్థ. కానీ.. తొలివెలుగు ఆ దందాలన్నింటినీ బట్టబయలు చేస్తూ వరుస కథనాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫినిక్స్ భూ బాగోతాలపై హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఆరా తీశారు. కబ్జాల్లో..ఫినిక్స్ “రూటే” సెప “రేటు” అంటూ తొలివెలుగు ఇచ్చిన భూ ఫిక్సింగ్ పార్ట్-13 కథనానికి స్పందించారాయన. హిల్ సైడ్ స్కూల్(రూట్ సొసైటీ )కబ్జాపై సీరియస్ అయ్యారు. రూట్ ఎడ్యుకేషనల్ సొసైటీకి 1996లో అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాలు కేటాయించింది. స్కూల్, హాస్టల్స్, టీచర్స్ వసతి గృహాలు మాత్రమే అందులో నిర్మించుకునేలా లీలా అగర్వాల్ అనే టీచర్ కు రిజిస్ట్రేషన్ చేసింది. రానురాను స్కూల్ బాగానే నడుస్తున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగా డబ్బులు వస్తాయనే ఆశతో ఫినిక్స్ కు అప్పగించారు ఆమె వారసులు. స్కూల్ తోపాటు ప్రభుత్వ స్థలంలో పాగా వేసిన భూమిపై కన్నేశారు. జీహెచ్ఎంసీ పార్క్ ప్రాంతానికి వెళ్లే దారిని సైతం కబ్జా చేశారు. అక్కడి వెయ్యి గజాలతోపాటు దుర్గం చెరువు ఎత్తులో మరో రెండు వేల గజాల్లో పాగా వేశారు.
ఫినిక్స్ ఎంటర్ అయితే అంతే..
ఫినిక్స్ కంపెనీకి హిల్ సైడ్ స్కూల్ పేరుతో నడుస్తున్న భూమిని అమ్మకానికి పెట్టారు లీలా అగర్వాల్ వారసలు. అందుకు 2019లో బొమ్మినేని భాస్కర్ రెడ్డికి 3,844 గజాల భూమిని(డ్యాకుమెంట్ నెంబర్ 5737/2019) విక్రయించారు. ఆ తర్వాత ఇదే 3393/2021 తో ఫినిక్స్ సిస్టర్ కంపెనీ అయిన స్వేయిర్ స్పేస్ డెవలపర్స్ కి రిజిస్ట్రేషన్ అయింది. మొత్తం భూమిని రూ.80 కోట్లకు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకుని.. రూ.200 కోట్లకు బినామీ కంపెనీలలో డైరెక్టర్లుగా కొందర్ని చేర్చుకుని అమ్మకానికి పెట్టారు. కానీ, ఈ భూమిని స్కూల్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి. ఇది తెలిసి కూడా రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలివెలుగు బట్టబయలు చేసింది. దీంతోపాటు మరో 3వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాపై కథనాలు ఇచ్చింది.
జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చి వారం రోజులు
అక్రమంగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు ఉన్నవాటిని కూల్చివేయాలని గత నెల 28న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రూట్ ఎడ్యుకేషన్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. ఇది జరిగి వారం అయినా ఏం చేయలేదు. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు.
హెచ్ఎండీఏ కమిషనర్ ఎందుకు వచ్చారంటే?
రూట్ ఎడ్యుకేషన్ సొసైటీకి దగ్గరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వద్దనే హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఉంటారు. అక్కడే రోజు వాకింగ్ చేస్తుంటారు. కానీ, కబ్జా జరిగినట్లు ఆయన గుర్తించలేకపోయారు. తొలివెలుగు కథనాలతో అన్ని విషయాలు తెలిసి అక్కడకు వెళ్లారు. అయితే, లోపలికి ఎలా వెళ్లాలో కూడా రూట్ క్లియర్ గా లేదు. దీంతో ఉదయం హిల్ సైడ్ స్కూల్ కి వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ దారి లేదని చెప్పడంతో అరోగ్య శ్రీ ట్రస్ట్ నుంచి అక్రమంగా జరిపిన నిర్మాణాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ అధికారి శైలజను, ఇతర సిబ్బందిని వెంట పెట్టుకుని లోపలికి వెళ్లారు. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం ఉంచిన భూమిలో కబ్జాలు పెట్టినట్లు తెలుసుకున్నారు. ఫినిక్స్ ఎంటర్ అయిన తర్వాత ఓ టీడీపీ నేత పార్క్ ప్రాంతంలో వెయ్యి గజాల్లో రెండు అంతస్తుల నిర్మాణాలు ప్రారంభించారు. పార్క్ కి దారి లేకుండానే కబ్జా చేశారు. ఈ విషయాలన్నీ అరవింద్ కుమార్ దృష్టికి వెళ్లాయి. అయితే.. కూల్చివేతలు ఎప్పుడు జరుగుతాయో మాత్రం ఏ అధికారి చెప్పడం లేదు.
ఫినిక్స్.. బినామీల కల్పవృక్షం
ఫినిక్స్ ఇండియా కంపెనీ ఓ భూలోక మాయా స్వర్గం. రాజకీయ నాయకులు అక్రమ సంపాదనకు మెట్టినిల్లు. ఫినిక్స్ కంపెనీకి బినామీలుగా 15 మంది డైరెక్టర్లు ఉంటారు. ఒక్కొక్క భూమికి ఒక్కో కంపెనీ ఏర్పాటు చేసి దందాలు నిర్వహిస్తుంటారు. రూట్ ఎడ్యుకేషనల్ సొసైటీ భూమి కోసం ఏర్పడిన స్వెయిర్ స్పేస్ డెవలపర్స్ కోసం రఘు రాయల, శ్రీకాంత్ పెంకె, భాస్కర్ రెడ్డి బొమ్మినేని, వెంకటరమణ మూర్తి డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే.. అతి తక్కువ వ్యవధిలో డజన్లకు పైగా కంపెనీలలో బినామీ డైరెక్టర్లను చేర్చుకున్నారు. ఎవరెవరు ఏ కంపెనీలో ఉన్నారో.. ఎలా తమ నైపుణ్యంతో ఫినిక్స్ కు భూములను కొల్లగొడుతున్నారో.. “బినామీల కల్పవృక్షంగా ఫినిక్స్” అనే మరో స్టోరీలో చూద్దాం.