హైదరాబాద్, తొలివెలుగు:తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు, మంత్రి నిర్లక్ష్యంపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి తొలివెలుగు ప్రచురించిన ‘‘మంత్రివర్యా సబబేనా?’’ కథనానికి ప్రభుత్వం దిగివచ్చింది. సోమవారం ఇంటర్ కాలేజీల యజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కానున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఎమ్సీఆర్‌హెచ్‌ఆర్డీలో జూనియర్ కాలేజీల యజమాన్యాలతో సమావేశం కానున్నారు.
ఈ భేటీకి హాజరుకావాలని 14 ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. వరుస విద్యార్థుల ఆత్మహత్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తున్న తీరుపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు గుప్పించారు నెటిజన్లు. నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ సూసైడ్ చేసుకున్నాడు.
అంతకుముందు మెడికో స్టూడెంట్ ప్రీతి ఘటన సంచలనం రేపింది. అదే తరహాలో వరంగల్ జిల్లాలో రక్షిత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వీరి మరణాల వెనుక యాజమాన్యాల ఒత్తిళ్లు, ర్యాగింగ్ వేధింపులేననే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే.. మంత్రి సబిత తన శాఖ పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో ఇలాంటి దారుణాలను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలతో పాటు పలువురు నెటిజన్లు మండిపడ్డారు.
విద్యార్థులు చనిపోతుంటే సరిగ్గా స్పందించడం లేదని.. అదే గ్యాస్ ధరల పెరుగుదలపై పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాత్రం రోడ్డెక్కి ప్లకార్డులతో ఎంతో ఉత్సాహంగా ధర్నాలో పాల్గొన్నారని మండిపడ్డారు. మరోవైపు బాలల హక్కుల సంఘం సైతం స్పందించి మంత్రి తీరును తప్పుబట్టింది. విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ మంత్రికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కరెక్ట్ కాదని తెలిపింది. గ్యాస్ ధర పెంపునకు ఆమెకు ఏం సంబంధం అని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో తొలివెలుగు ‘‘మంత్రివర్యా సబబేనా?’’ అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రభుత్వ వర్గాలు స్పందించి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలకు పిలుపునిచ్చాయి.