– తొలివెలుగు కథనానికి స్పందన
– భారతి.. భూముల హారతి వార్తలతో చర్యలు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మార్వో
– టైటిల్ లేకుండా అమ్మితే కఠిన చర్యలన్న ఆర్డీవో
– అమ్మకాలేమీ జరపలేదంటున్న యాజమాన్యం
– కేసు నమోదు.. నార్సింగి పోలీసుల దర్యాప్తు
– కొంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంపై హెచ్ఎండీఏ నజర్
క్రైంబ్యూరో, తొలివెలుగు:తొలివెలుగు దెబ్బకు రియల్ట్ స్కామర్స్ వెన్నులో వణుకు పుడుతోంది. భారతి బిల్డర్స్ కు సంబంధించి.. భారతి భూముల హారతి అంటూ మొదటి కథనం ఇవ్వగా హెచ్ఎండీఏ స్పందించింది. కంపెనీ ప్రాజెక్టులపై ఆరా తీసింది. అనుమతులు లేకుండా ఎలా పనులు చేపడుతున్నారో.. నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పనులు జరిపితే క్రిమినల్ కేసులు పెడుతామని అధికారులు అంటున్నారు. మరోవైపు కాందిశీకుల భూములను కోకాపేట పేరు చెప్పి అమ్మకం జరపడంపై రెవెన్యూ శాఖ కన్నెర్ర చేసింది. నార్సింగి పోలీసులకు ఎమ్మార్వో 5 పేజీలతో ఫిర్యాదు చేశారు. తొలివెలుగు క్రైంబ్యూరో కథనాన్ని ప్రస్తావిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదులో ఏముదంటే..?
తొలివెలుగు ఇచ్చిన.. భారతి భూముల హారతి న్యూస్ ఆధారంగా ఈ ఫిర్యాదు చేశారు. కోకాపేట పేరుతో అమ్మకాలు జరుపుతున్నారు. 302, 303 సర్వే నెంబర్లు కోకాపేట రెవెన్యూ పరిధిలో లేవు. వారిచ్చిన లొకేషన్ లో పుప్పాలగూడ సర్వే నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. మొత్తం 7 ఎకరాల 27 గుంటల భూమిలో వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయో సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఫిర్యాదులో అటాచ్ చేశారు. కాందిశీకుల భూములపై బ్రీఫ్ నోట్ ఇచ్చారు. సర్వే నెంబర్ 301 నుంచి 308, 325 నుంచి 328, 331 నెంబర్స్ లో 198 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. డిస్ ప్లేస్ పర్సన్స్ యాక్ట్ 1954 ప్రకారం వివాదం కోర్టులో కొనసాగుతోందని వివరించారు. ఈ భూములపై టీఎస్ఐఐసీ 2021లో వేలం పాట వేసింది.. 6 కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. ఫిజికల్ పొజిషన్ లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలో థర్డ్ పార్టీకి భారతి బిల్డర్స్ అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలివెలుగు కథనం ఆధారంగా దర్యాప్తు చేసి భారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై క్రిమినల్ లేదా చీటింగ్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ రాజశేఖర్ నార్సింగి పోలీసులను కోరారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తవ్వగానే ఎఫ్‌ఐఆర్ చేస్తామని సీఐ శివ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ భూములు అమ్మితే కఠిన చర్యలు- ఆర్డీవో చంద్రకళ
సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలతో థర్డ్ పార్టీకి ప్రభుత్వ భూమి విక్రయిస్తే కఠినంగా చర్యలు ఉంటాయని ఆర్డీవో చంద్రకళ తొలివెలుగుతో అన్నారు. ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పారు. కోర్టు కేసుల్లో మగ్గుతున్న వివాదాస్పద భూములను క్రయవిక్రయాలు జరిపితే నేరమేనని హెచ్చరించారు. భూములపై ఎలాంటి వివరాలు కావాలన్నా.. రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. మాయమాటలు నమ్మి భూములు కొంటే తర్వాత ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఆర్డీవో చంద్రకళ.
అమ్మకాలు జరపడం లేదు- భారతి బిల్డర్స్
వివాదాస్పదమైన భూమిలో తాము అమ్మకాలు జరపడం లేదని భారతి బిల్డర్స్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. కొంతమంది రైతులు తమని అప్రోచ్ అయ్యారని తెలిపింది. వాటిపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగలేదని.. పోలీసుల ప్రాథమిక దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పింది.