నల్లగొండ జిల్లాలో జై భీం సినిమాని తలపించేలా ఓ దళిత యువకుడిని టూటౌన్ ఎస్సై డీ నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరా చావబాదారు. విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులతో బేరసారాలు జరిపారు. ఈ విషయాన్నంతా తొలివెలుగు ప్రసారం చేయడంతో డొంకంతా కదిలింది. జిల్లా ఎస్పీకి మా ప్రతినిధి లైవ్ లో నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై స్పందించిన ఎస్పీ విచారణ జరిపిన అనంతరం ఎస్సై, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే దళిత యువకుడిని ఓ భూమి విషయమై టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఆ యువకున్ని ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరా వారి స్టైల్ లో విచారించారు. జై భీం సినిమాను తలపించేలా ఉంది ఆ సీన్. భాధితుని పరిస్థితి విషమించడంతో అలర్ట్ అయిన ఎస్సై సేమ్ జై భీం తరహాలో ఆ విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యులతో బేరసారాలు చేశారు. వార్త ఆగదు నిజం దాగదు అన్నట్టు.. తొలివెలుగు ఈ తతంగం అంతా బట్టబయలు చేసింది. తొలివెలుగు ప్రతినిధి లైవ్ లో నేరుగా నల్గోండ జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్ చేసి మాట్లాడారు. స్పందించిన ఎస్పీ ఓ విచారణ కమిటీ వేశారు. రంగంలోకి దిగిన విచారణ అధికారి.. బాధితునితో పాటు చికిత్స చేసిన వైద్యులు, మరికొంత మంది సాక్షులను విచారించారు. అనంతరం ఎస్సై తప్పిదం ఉన్నట్లుగా నిర్ధారించి ఆ నివేదికను ఎస్పీకి సమర్పించారు. దాంతో హైదరాబాద్ రేంజ్ డీఐజీ విబి కమల్ హాసన్ రెడ్డికి పంపి వీరిద్దని సస్పెండ్ చేయాలని ఎస్పీ రంగనాధ్ కోరారు. ఆయన సిఫార్సు మేరకు ఇద్దర్నీ సస్పెండ్ చేస్తున్నట్టు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలోనే ఎస్సై మంచివాడు. నువ్ సైలెంట్ గా ఉండకుంటే బాగుండదు అంటూ కొంతమంది తొలివెలుగు ప్రతినిధికి పోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు చేశారు. ప్రజా సమస్యలు, పేద, బడుగు బలహీన వర్గాలకు తొలివెలుగు అండగా ఉంటుందే గానీ.. ఎలాంటి బెదిరింపులకు భయపడదు. నిజాన్ని నిర్భయంగా చెబుతుంది.