– అధికారులను కదిలించిన తొలివెలుగు
– కేజీబీవీలో విద్యార్థుల అవస్థపై ప్రత్యేక కథనం
– స్పందించి.. వసతిగృహాన్ని పరిశీలించిన అధికారులు
– తగిన సదుపాయాలు కల్పిస్తామని హామీ
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయం హాస్టల్ షాద్ నగర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తోంది. సరైన సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై తొలివెలుగు ఓ కథనాన్ని ఇచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాధికారి, స్థానిక ఆర్డీవో వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులకు త్వరలోనే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇటు స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా సందర్శించారు. రాష్ట్రానికి విద్య లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం అని మండిపడ్డారు. మన ఊరు మనబడిలో భాగంగా ఈ హాస్టల్ కు వెంటనే అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బడులు, హాస్టళ్లు అన్ని చాలా బాగున్నాయని, చదువులు కూడా బాగా సాగుతున్నాయని ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడమే గానీ.. వాస్తవంగా చాలా స్కూళ్ళు, హాస్టళ్లలో మెరుగైన సేవలు అందడం లేదు. దానికి నిదర్శనమే ఈ వసతిగృహం. విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తూ తమ చదువును కొనసాగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు ఇక్కడ. దాదాపు ఈ విద్యాలయంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదుతున్న వారు ఉన్నారు.
ఇంకొన్ని రోజుల్లో ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చదువుకోడానికి వాళ్లు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కస్తూర్బా గాంధీ విద్యాలయం(కేజీబీవీ)లో విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో షాద్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ భవానినికి మార్చారు. ఇక్కడ తలుపులకు డోర్లు లేకపోవడంతో వాటికి అడ్డంగా దుప్పట్లు పెడుతున్నారు. దానికి తోడు బాత్రూం అండర్ డ్రైనేజీ నిండిపోయి పొంగి పొర్లుతోంది. దోమలు, ఈగలకు నిలయంగా మారి దుర్వాసన వస్తోంది. స్నానాలు చేసేటప్పుడు మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో దుప్పట్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు విద్యార్థినులు.
ఈ వసతి గృహంలో దాదాపు 240 మంది విద్యార్థులకు గానూ కేవలం రెండే రెండు మరుగుదొడ్లు ఉండడంతో ఒకటి పూర్తిగా నిండిపోయి బయటికి పొంగిపోర్లుతోంది. ప్రస్తుతానికి ఒక్కదానినే విద్యార్థినులు అందరూ ఉపయోగిస్తున్నారు. వర్షం పడితే వీరి అవస్థలు వర్ణణాతీతం. సామాగ్రి పెట్టెలు నీటితో నిండుతున్నాయి. గదుల్లో నుండి వర్షపు నీరు పైనుంచి కిందకు కారుతోంది. విద్యార్థులకు సరిపడా గదులు లేక చదువుకోవడం, భోజనం చెయ్యడం, పడుకోవడం ఒకే గదిలో చేస్తున్నారు.