వైజాగ్ విషవాయువు లీకేజీ తరువాత అక్కడి ప్రజలు ఎదురుకున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. తొలి వెలుగుతో కొందరు తమ అనుభూతిని పంచుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి దగ్గరలో నివాసం ఉంటున్నారు రాంబాబు. రాంబాబు తొలి వెలుగుతో మాట్లాడుతూ.. మేము పద్మారావు నగర్ జనతా కాలనిలో ఉంటాం, నాకు రోజు ఉదయం 4 గంటలకు లేచి వాకింగ్ వెళ్లడం అలవాటు. కానీ ఈరోజు 3.30 కి మెలుకువ వచ్చింది. శ్వాస ఆడడం లేదు, ఏదో వాసన వస్తుంది ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యిందేమో అని వెళ్లి చూశాను. సిలిండర్ దగ్గర అలాంటిది ఏమి లేదు అనిపించింది. బయట రోడ్డు పై చప్పుడు వినిపిస్తుంది, ఇంత ఉదయం ఏంటి ఇది అని తలుపులు తెరిచి బయటకు వెళ్లి చూశాను. రోడ్డు పై చాలా మంది పరుగులు తీస్తున్నారు. అందులో చాలా మంది రాత్రి వేసుకునే బట్టలతోనే ఉన్నారు. అంతలోనే మా పక్కన ఉండే అమ్మాయి అంకుల్ ఎల్జీ పాలిమర్స్ నుండి గ్యాస్ లీక్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తుంది. అప్పటికే నాకు కళ్ళు మండుతున్నాయి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది గా ఉంది.
అంతలోనే నా భార్య బయటకు వచ్చి పరుగులు పెడుతున్న వాళ్ళను చుసి చాలా టెన్షన్ పడుతుంది. ఏం జరిగిందో చెప్తూనే మా పిల్లలను నిద్రపలేపాను.మా ఇంట్లో నేను నా భార్య, మా అమ్మాయి, నా మనువరాళ్లు మొత్తం 6 మందిమి ఉంటాం. నా దగ్గర బైక్ మాత్రమే ఉంది, ఒక్క బైక్ పై అంత మందిని ఎలా తీసుకపోవాలి అని టెన్షన్ పడ్డాను, ఎలాగైనా ఇక్కడినుంచి వెళ్లిపోవాలి అని మొదట ఇద్దరిని ఎక్కించుకొని, మిగతా వాళ్ళను నడుచుకుంటూ రమ్మని బయల్దేరాను, మధ్యలో రోడ్ల పై తెలిసిన వాళ్ళు చాలా మంది కింద పడిపోయి ఉన్నారు, కుక్కలు పశువులు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. అవన్నీ చూసి నా భార్య చాలా భయపడుతుంది, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేపగండ్ల విలేజ్ నాయుడు తోట దగ్గర కాస్త గ్యాస్ వాసన తగ్గినట్లుగా అనిపించింది, దాంతో వాళ్ళను అక్కడే విడిచిపెట్టాను. అప్పటికే అక్కడికి చాలా మంది వచ్చి కూర్చున్నారు. మిగతా నా కుటుంబ సభ్యులు నడుచుకుంటూ వస్తున్నారు. వెళ్లి వాళ్ళను బైక్ పై తీసుకొచ్చాను. మాకు నాయుడు తోట దగ్గర టీ ఇచ్చారు. టీ తాగి కూర్చున్నాం, అప్పుడు నా ఫ్రెండ్ కు ఫోన్ చేశాను. వాళ్లకు అప్పటిదాకా తెలియదు, తలుపులు వేసుకొని ఇంట్లో పడుకున్నారు, వెంటనే వెళ్ళిపొమ్మని చెప్పిన. అంతలోపే మేము ఉన్న నాయుడు తోట దగ్గర గ్యాస్ వాసన పెరగడం మొదలు పెట్టింది. నా కొడుకు బెంగళూర్ లో ఉంటాడు ఫోన్ చేసి పెందుర్తి వెళ్ళండి అని చెప్పాడు. చాలా మంది డ్యామ్ పేట వైపు పరుగులు పెడుతున్నారు. నేను మొదట నా భార్యను మనవడిని తీసుకొని పెందుర్తి వైపు వచ్చాను.పేందుర్తిలో వాళ్ళను వదిలిపెట్టి మిగతా వాళ్ళను కూడా పెందుర్తి తీసుకొచ్చాను. ఎల్జీ పాలిమర్ కు పెందుర్తి 6 కిలోమీటర్ల దూరం ఉంటది. ఇక్కడ సమస్య లేదు అనుకున్నాం కానీ ఇక్కడ కూడా వాసన రావడం మొదలైంది ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పారు.ఇప్పుడే మా ఊర్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తున్న, చాలా మంది లిఫ్ట్ చేయడం లేదు ఆందోళనగా ఉంది అన్నారు.