– హాట్ టాపిక్ గా చిరంజీవి కబ్జా బాగోతం
– పాత వారే కేటాయించారన్నకొత్త కమిటీ
– లే అవుట్ రివైజ్ చేయకుండానే అక్రమ రిజిస్ట్రేషన్
– 10వేల గజాల పై 2002 లోనే సర్వే
– తప్పుల తడకగా లే-అవుట్
– కోట్ల విలువచేసే భూముల పై సర్కార్ నిర్ణయమేంటో?
– తవ్వేకొద్దీ బయటకొస్తున్నఅక్రమాలు
– తొలివెలుగు క్రైం బ్యూరో చేతిలో..
– జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీ అక్రమాలు
– ఆధారాలిస్తాం.. రెవెన్యూ,జీహెచ్ఎంసీ మేల్కొంటాయా..?
క్రైం బ్యూరో, తొలివెలుగు: మెగాస్టార్ చిరంజీవి 595 గజాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవ్యవహారాన్ని తొలివెలుగు వెలికి తీసింది.దీనిపై రవీంద్రనాథ్ చౌదరి టీం తమ తప్పేమిలేదని..సదరు భూమిని నరేంద్ర చౌదరి సారధ్యంలోనే అప్రూవల్ చేశారని.. తాము కేవలం దాన్నిఅమలు మాత్రమే చేశామని చెప్తున్నారు. ఇందుకు ఆధారంగా పాత కమిటీ 2006 నుంచి 2021 వరకు రిజిస్ట్రేషన్స్ చేసిన జాబితాను విడుదల చేశారు.29 మందికి 58 గజాల నుంచి గరిష్టంగా 650 గజాల వరకు రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి మొదటగా జీహెచ్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. లే-అవుట్ ని ఆధునీకరిస్తూ అప్రూవల్ చేయాలి. అప్పుడే సొసైటీ పాలక మండలికి రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉంటుంది. అలా కాకుండా..అందరం పెద్ద మనుషులమే..మమ్మల్ని ఎవరేం అంటారనే అహంకారంతో తమకు నచ్చినట్టు చేసేశారు. ఒకవేళ నరేంద్ర చౌదరి టీం తప్పు చేస్తే..దానిపై కోర్టుకు వెళ్లి రద్దు చేయించే అధికారం కొత్త కమిటీకి ఉంటుంది..లేదా సదరు అక్రమ రిజిస్ట్రేషన్లను తాము గుర్తించటం లేదని హ్యాండోవర్ చేసుకోవచ్చు. కాని అలా కాకుండా వారు చేశారు.. మేము కూడా అలానే చేస్తామనే ధోరణిలో రవీంద్రనాథ్ చౌదరి టీం వ్యవహరిస్తుండటాన్ని సభ్యులు తప్పుబడుతున్నారు.
ఇంతకీ ఎం జరిగిందంటే..?
చిరంజీవి ఇంటి పక్కనే ఉండే ప్లాట్ నెంబర్ 303 ఓ, 303 క్యూ ఓనర్స్ అయిన వంశీ కృష్ణ, ప్రవీణలు 2002లో హైకోర్టు గడప తొక్కారు. తమ ప్లాట్స్ లో ఫస్ట్ పోలీస్ బెటాలియన్స్ యూసఫ్ గూడ వారు, విజయ కో ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ వారు కబ్జా చేస్తున్నారని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
హౌజింగ్ సొసైటీ పక్కనే ఉండే ప్రభుత్వ భూమిని కమాండెంట్ 1వ బెటాలియన్ కి 6.23 గుంటలు భూమిని జీవోఎంఎస్ నెం.1989, -రెవెన్యూ తేదీ 14.12.1965 న కేటాయించారు. విజయ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి 3.20 గుంటలు మరియు 6.23 గుంటల భూమిలో 1991లో ఎంసీహెచ్ ద్వారా లే-అవుట్ తీసుకున్నారు. ఫైల్ నెంబర్. 310159 180/టీపీ/హెచ్.వో /186/ తేదీ 15.06.1991. 2002లో ఓ బిల్డర్ నిర్మాణాలు చేపడుతుంటే.. తమ భూమిలోకి వచ్చారని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డబ్ల్యు.ఏ. నెంబర్ 1567 ఆఫ్ 2002 లో జస్టిస్ ఈశ్వరయ్య , జస్టిస్ట్ లక్ష్మణన్ తో కూడిన డివిజన్ బెంచ్ అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. ఇందుకు అడ్వకేట్ కమిషన్ వేసి,డిప్యూటి డైరెక్టర్ ల్యాండ్ సర్వేయర్ తో చేయించిన సర్వే రిపోర్ట్ ని పొందుపర్చింది.
అడ్వకేట్ కమిషన్,సర్వే రిపోర్ట్.. తొలివెలుగు ఎక్స్ క్లూజివ్
2002లో సర్వేలో సొసైటీ అక్రమాలు అధికారికంగా బయటపడ్డాయి. లే అవుట్ లో ప్లాట్ ఒక వద్ద భూమి మరో దగ్గర ఉంది. చిరంజీవి ఇంటికి దక్షిణ భాగాన 250*360 అనగా వెయ్యి గజాల భూమి అదనంగా ఉందని తేల్చారు. అయితే ఇప్పుడు చిరంజీవి ఇందులో నుంచి 595 గజాలు మాత్రమే కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా భూమి కథ ఏంటో మరో కథనంలో వివరించబోతోంది తొలివెలుగు క్రైం బ్యూరో.
కోర్టును ఆశ్రయించిన వారి ప్లాట్స్ 303 ఓ, పీ మరియు క్యూ లు 295,294 మరియు 293 కి ఉత్తరాన బౌండరీలు ఉన్నట్లు లే అవుట్స్ లో చూపించారని వారి రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లో చూపించుకున్నారని తెలిపారు.కాని పొజిషన్ లో 294, 295 ప్లాట్ కి నార్త్ దిశగా చిరంజీవి ఇల్లు 303 ఎన్. లే అవుట్ ఉన్నది.. అక్కడ పొజిషన్ లో ఉన్నది లెక్క సరితూగటం లేదు. స్కేల్ లెక్కల్లోకి రాకుండా ఉంది. అయితే రోడ్డు నెంబర్ 25 నుంచి 303 ప్లాట్ కి పడమరగా 303 ఈ వద్ద నుంచి మలుపు తిరిగి 285 ప్లాట్ వరకు తూర్పు దిశగా 50 ఫీట్ల దారి వెళ్లాలని పొజిషన్ లో ఉంది. 285 నుంచి 303 ప్లాట్ వరకు నార్త్ బౌండరీల పై స్కెచ్ వేసి కోర్టుకు రిపోర్ట్ సమర్పించారు. చిరంజీవి ఇంటితో పాటు వంశీకృష్ణ, సిబిఐటీ కాలేజ్ సుభాష్, ప్రవీణలకు నార్త్ కు 50 ఫీట్ల దారి ఉంది. అయితే ఆ దారి నుంచి రోడ్డు నెంబర్ 25 కి మధ్యలో భారీగా మిగులు భూమి ఉంది.ఆ భూమి అంతా…ప్రభుత్వ భూమియే..288 నుంచి 293 ప్లాట్స్ కి నార్త్..అటు 303 క్యూ, పీ, ఓ, వరకు డీప్ గా మిగులు భూమి ఉంది.ఈ ప్లాట్ ఓనర్స్ అంతా.. వారి ప్లాట్స్ అనుకుని ఉండాల్సింది పోయి.. భవిష్యత్త్ లో రోడ్డుతో పాటు మరింత భూమిని వదలాల్సి వస్తుందని ఊహించుకుని 60 ఫీట్ల నుంచి మొదలు కొని ఈశాన్యం పెరిగేలా.. అందరూ తూర్పుకు వెళ్తుంటే..250 ఫీట్ల వరకు వెళ్లారు. పొడువు 750 ఫీట్ల వరకు ఉంటుంది. అంటే సుమారు 10 వేల గజాల భూమి అక్కడ ప్రభుత్వ మిగులు భూమి ఉంది. ఈ భూమికి దారి లేదనే వంకతో పక్క ప్లాట్స్ వారంతా కబ్జాలు చేసి సొసైటీతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇప్పుడు అధికారులు ఏం చేయాలి?
బడాబాబుల సొసైటీ కావడం.. మీడియా వారిచేతిలో ఉండటంతో ..పైగా గజం 4 లక్షలకు పైనే పలుకుతుండటంతో ఇప్పటికే అందరూ ఈ ఖాళీ ప్రాంతాన్నిదర్జాగా కబ్జా పెట్టేశారు. కొందరైతే ఏకంగా రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. మరికొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరందరికి నోటీసులు ఇచ్చి..ప్రభుత్వం నుంచి రెగ్యూలరైజేషన్ చేయించుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. లేదా సొసైటీ చెప్పుతున్నట్లు 40 శాతం ఓపెన్ స్పేస్ మెయింటెయిన్ చేయాలి. కాని ఇలా విఐపీలు ఉన్నారని వారికి అంటగడుతుంటే.. చూస్తూ ఊరుకోవద్దు. ప్రభుత్వ భూమి అని గుర్తించి..బడాబాబుల చెరలోకి వెళ్లిన కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే సామాన్యుడికి ప్రజాస్వామ్యం పట్ల మరింత విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు మార్కెట్ విలువలతో ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి పేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. అప్పుడే మరొకరు తప్పు చేసి.. తప్పించుకోని తిరిగే పరిస్థితి ఉండదు.మీడియాను అడ్డుపెట్టుకొని ఆడే ఆటలు సాగవని అర్థం చేసుకుంటారు.
ఇక.. ఖాళీ భూములను కట్టబట్టడంతో ఎవరికి ఎంత మేలు జరుగుతుందో..పెద్దమనుషులుగా చలామణీ అవుతూ ఎంత భూమిని స్వాహా చేశారో మరో కథనంలో .. తొలివెలుగు మీ ముందు ఉంచనుంది. ప్రజల సొమ్ము అప్పనంగా దోచేసే తిమింగలాల కథలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది తొలివెలుగు క్రైం బ్యూరో.