– ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్
– మూడేళ్లయినా నో యూజ్!
– అంతుచిక్కని అక్రమాలకు కేరాఫ్?
– కాలకేయుడి భాష మాదిరి అర్థం కాని కృష్ణమాయ
– తెరచాటున సాగిన చంద్రలీల..
– సాక్షాధారాలతో తొలివెలుగు పరిశోధనాత్మక కథనాలు
– ముక్తేశ్వర స్వామి సాక్షిగా కళ్లకు కట్టే నిజాలు
– కాళేశ్వరం కరప్షన్ కహానీ- పార్ట్ 1
క్రైంబ్యూరో, తొలివెలుగు:కాళేశ్వరం ప్రాజెక్ట్.. కుంభకర్ణుడి ఆకలి మాదిరి తెలంగాణ ప్రజల సొమ్మంతా తినేస్తోంది. ఇప్పటిదాకా రూ.లక్ష కోట్లకు పైగా పెట్టినా ఇంకా కావాలంటోంది. అయితే.. ఎంత ఖర్చుపెట్టినా ఫలితం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అవుతోందనే విమర్శలు ఉన్నాయి. పాలకులు ఎవరైనా పదేళ్లు, 20 ఏళ్లు ముందు చూపుతో ప్రాజెక్ట్ లు కడతారు. లక్షల కోట్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే ఒక శతాబ్దపు కాలమైనా ఉపయోగపడాలి. అప్పటికప్పుడు కరువు తీరి.. కడుపు నిండేలా ఉండాలి. కానీ.. ఇవేవీ కాళేశ్వరానికి వర్తించేలా లేవు. ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో చేసిన పాపాలు అలాంటివి మరి. ఇప్పుడే ఒక్కొక్కటిగా అవన్నీ బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్ కరప్షన్, ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలే ప్రజలకు శాపంగా మారాయి.
ఇలా కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారు!
తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాజెక్ట్ కోసం 2008లో అప్పటి మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ.. మహారాష్ట్రలో వేల ఎకరాలు ముంపునకు గురవ్వడం నష్టపరిహారంలో అలస్యంతో ఆందోళనలు కొనసాగాయి. అప్పటికే కాలవలు తవ్వేశారు. ప్రాజెక్ట్ లు త్వరగా పూర్తి చేయాలని, అక్కడి ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి, రీ డిజైన్ పేరుతో తెరపైకి వచ్చిందే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. 140 టీఎంసీల ప్రాణహిత చేవెళ్లను 1.4 టీఎంసీకి తగ్గించారు. 148 మీటర్లకు కుదించి 2 లక్షల ఎకరాల ఆయకట్టు చూపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 7 లింకులుగా 28 ప్యాకేజీలుగా మార్చి నిర్మాణం చేపట్టారు.
ప్యాకేజీలు ఇవే!
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను.. గోదావరి నదికి 100 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మొదటి దశగా ప్యాకేజీ 1, 3. లైన్డ్ గ్రావిటీ కెనాల్స్, సీఏసీడీ పనులు, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మౌలిక సదుపాయల నిర్మాణాలు, గేట్లు, హెడ్ రెగ్యులేటర్లు గ్రావిటీ కెనాల్స్.. ఇలామూడు బ్యారేజీల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయి. రెండో దశగా ప్యాకేజీలు 2, 5, 7, 8. ఇందులో 15వ కిలోమీటర్ నుంచి 28.5 కిలోమీటర్ల వరకు అంటే కజ్రల్లి నుంచి సురగపల్లి వరకు తూములు, క్రాస్ రాతి, క్రాస్ డ్రైనేజీ పనులు, లైనింగ్ నిర్మాణాలు. ప్యాకేజీ 7లో 3.5 కిలో మీటర్ల పొడవు గ్రావిటీ కెనాల్, 11.5 కిలోమీటర్ల పొడవు సొరంగం, పంప్ హౌజ్, సర్జపూల్ నిర్మాణం చేపట్టారు.
టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఇవే!
మొదటి దశ ప్యాకేజీ 1 కోసం ఈపీసీ పద్దతిలో ఎస్ఎంపీఎల్ లిమిటెడ్ కు, మొదటి దశ ప్యాకేజీ 3 కోసం హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ(హెచ్సీసీ), ఎస్ఈడబ్ల్యూ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్)కు అందించారు. రెండవ దశ 2, 5, 7, 8 ప్యాకేజీల కోసం ఈపీసీ పద్దతిలోనే ఐఎల్ అండ్ ఎఫ్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కు ఇచ్చారు. మూడవ దశలో 6, 21 ప్యాకేజీల కోసం ఈపీసీ పద్దతిలోనే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కు ఇవ్వబడింది.
భారీగా పెరిగిన అంచనాలు!
సుందిళ్ల బ్యారేజీ అంచనాలు రూ.1,400 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు, మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,200 కోట్లు, అన్నారం బ్యారేజీకి దాదాపు రూ.1,700 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు అంచనాలు పెరిగాయి. లిఫ్టుల అంచనాలను కూడా సవరించారు. గతంలో ఎన్నో ప్రాజెక్ట్ లు నిర్మాణం చేసినా కూడా ఇంత భారీగా అంచనాలు పెంచింది లేదు. నాగార్జున సాగర్ కి 1954లో అంచనా రూ.122 కోట్లు. అది 1968లో రూ.164 కోట్లకు, 1974లో రూ.312 కోట్లకు చేరింది. 2000 సంవత్సరంలో రూ.1,184 కోట్లతో పూర్తయింది. అంటే 46 సంవత్సరాలకు పెరుగుతూ వచ్చింది. శ్రీరాం సాగర్ అంతే.. రూ.40 కోట్లతో 1964లో ప్రారంభమైతే 1997 వరకు రూ.4,300 కోట్లకు చేరుకుంది. చివరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా 2004లో రూ.900 కోట్లతో ప్రారంభమై 2013కి అంచనా రూ.1,366 కోట్లు కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016కి రూ.2,048 కోట్లకు చేరుకుంది. అంటే.. తెలంగాణ వచ్చక.. ప్రాజెక్ట్స్ ఎంత స్పీడ్ గా పూర్తి అయ్యాయో అంతే స్పీడ్ గా 2 సంవత్సరాలు కాకముందే రెండొంతుల రేట్లు పెంచేశారు. ఇదంతా ప్రభుత్వానికి నేరుగా కమిషన్స్ కోసమేనని కాగ్ నివేదికలో పేర్కొంది.
మోటార్స్ కొనుగోళ్లలో భారీ స్కాం!
కాళేశ్వరం ఎత్తిపోతలకు మోటార్స్ బిల్సే కీలకం. వాటిలోనే రూ.5,988 కోట్ల స్కాం బయటపడుతోంది. మోటార్లు తయారు చేసిన బీఈఎల్ ఎంతకిచ్చింది.. టెండర్లలో చెప్పింది ఎంత..? అగ్రిమెంట్ చేసుకున్న విలువ ఎంత? ఇలా ఒక్కొక్క ప్యాకేజీలో ఎలా కొట్టేశారో మరో కథనంలో తొలివెలుగు క్రైంబ్యూరో ఎక్స్ క్లూజివ్ గా మీ ముందుకు తీసుకొస్తుంది.