– రాష్ట్రాన్ని నిండా ముంచిన మేఘా కృష్ణారెడ్డి!
– గొప్పలు చెప్పడంతో గుడ్డిగా నమ్మేసిన కేసీఆర్!
– సారును అమాయకుడ్ని చేసి ఆడుకున్న వైనం!
– టెండర్లు మేఘా డైమండ్ హౌజ్ లోనే?
– పంప్ హౌజ్ ల వద్ద ఏం జరిగింది?
– జనం నెత్తిన ఎంత భారం పడనుంది?
– డిఫెక్ట్ లయబిల్టీ కాలం అయిపోయిందా?
– కాళేశ్వరం కరప్షన్ కహానీ పార్ట్ 2
క్రైంబ్యూరో,తొలివెలుగు:మూడేళ్లుగా పైసా లాభం లేకుండా గోదావరి నీళ్లను మళ్లీ అక్కడే ఎత్తిపోసిన భారీ ఎత్తిపోతల పథకం గుదిబండలా తయారైంది. దీనికి గల కారణాలు, తెర చాటున కృష్ణలీలలకు సంబంధించిన అన్నింటిపై తొలివెలుగు క్రైంబ్యూరో వరుస కథనాలు ఇస్తోంది. సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. గోదావరి నదికి సీడబ్లూసీ 50 లక్షల క్యూసెక్కుల వరద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాల రిపోర్టులు ఉన్నాయి. అయితే.. 1994 నుంచి 2004 వరకు ఏర్పడిన కరువునే ప్రధానంగా లెక్కలోకి తీసుకుని ప్రాజెక్ట్ నిర్మాణాలకు పునాదులు వేశారు. అందుకే డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైగా మీరే సూపర్ ఇంజనీర్ అని కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తి.. పాతాళానికి పడేసిన ఘనత మేఘా కృష్ణారెడ్డికే దక్కుతుంది. అందుకు లక్ష ఉదాహరణలు ఉన్నాయి.
లక్ష్మి పంప్ హౌజ్ నిర్మాణంలో లోపాలు?
నది నీటిని అంచనా వేయకుండానే సివిల్ వర్క్ లో కక్కుర్తి పడి వారికి అనువైన ప్రాంతంలో పంప్ హౌజ్ లు నిర్మించారనే ఆధారాలు కనిపిస్తున్నాయి. వరద నీటి మట్టం 121 మీటర్లకు అంచనా వేసి పంప్ హౌజ్ ల రక్షణ గోడ నిర్మాణం జరగాలి. కానీ.. 106 మీటర్ల ఎత్తు వరకే నిర్మించారు. తాజాగా వచ్చిన వరద నీటిమట్టం 113 మీటర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో పంపులు ఇంకా దూరంగా నిర్మించి ఉండాల్సిందని ఇంజనీర్ల అభిప్రాయం.
సివిల్ వర్క్ లో కక్కుర్తి?
వేల కోట్లు విలువ చేసే మోటార్లను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ.. వాటిని నీటి నుంచి రక్షించే గోడలనే సిమెంట్ పిల్లర్స్ రూపంలో నిర్మించకుండా, సాధారణ సిమెంట్ ఇటుకలతో 12 ఇంచుల గోడ నిర్మాణం చేశారు. మధ్యలో పిల్లర్స్ వేసిన చోట ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వరద దాటికి ఒక్కసారిగా 17 పంపుల గోడ భారీ శబ్దంతో కూలిపోయింది. అప్పటికే నీటితో మునిగిపోయిన మోటర్లలో ఈ గోడ కూలిపోవడంతో.. ఇసుక మేట, బురద మయంతో పనికి రాకుండా పోయే ప్రమాదంలో పడిపోయింది. ఇక సరస్వతి బ్యారేజ్ కు నీళ్లు వెళ్లే గ్రావిటీ కెనాల్ మరోసారి కూలిపోయింది. 6.4 కిలోమీటర్ల మైలు రాయి వద్ద కాలువకు భారీ నష్టం జరిగింది. అంటే.. కాంట్రాక్టర్ పనితనం సివిల్ వర్క్ లో ఎలా ఉందో ఇట్లే తెలిసిపోతోంది.
ఎవరినీ రానివ్వడం లేదు?
పంప్ హౌజ్ ల మునక తర్వాత ఎంత నష్టం జరిగిందో తెలుసుకునేందుకు ఎవరు వెళ్లినా రానివ్వడం లేదు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబుని సైతం అడ్డుకున్నారు. ఆఖరికి మీడియాని దగ్గరకు రానివ్వడం లేదు. జరిగిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మాత్రం మేఘా కంపెనీ తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. జనరేటర్ల సహాయంతో అక్కడ ఏదో వర్క్ చేస్తూ హడావుడి చేస్తోంది.
కేసీఆర్ ను తొందరపెట్టి మాయ చేసిన కృష్ణారెడ్డి?
కేసీఆర్ ఎవరి మాట వినరు. తాను చేయాలనుకున్నదే చేస్తారనేది ఎన్నోసార్లు స్పష్టమైంది. ప్లాన్ రివర్స్ కొట్టినా కప్పిపుచ్చుకోవడంలో దిట్ట. అయితే.. కాళేశ్వరం విషయంలో మేఘా కృష్ణారెడ్డి, కేసీఆర్ ని ఉసిగొల్పారని అపవాదు ఉంది. వైఎస్ఆర్ జలయజ్ఞంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ప్రారంభించిన కృష్ణారెడ్డి.. హంద్రీనివా, వలిగొండ ప్రాజెక్ట్స్, చింతలపుడి ఎత్తిపోతల, పట్టిసీమ లాంటి వాటితో కేసీఆర్ కి బొమ్మ చూపించాడు. నీళ్ల విషయంలో తొందరపాటుగా ఉన్న ముఖ్యమంత్రికి కరువుని మాత్రమే ఎక్స్ పోజ్ చేసి.. ఎలా చేయాలో నిర్ణయాలు కాంట్రాక్టర్ కి అనుకూలంగా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో డబ్బుల కోసం మాత్రమే ఆలోచించే కాంట్రాక్టర్ తనకు లాభం అయ్యేలా చూసుకున్నాడు. అందుకు ఎన్నో టెండర్లు ఇంజనీర్ కార్యాలయంలో జరగాల్సినవి మేఘా ఆఫీస్ డైమండ్ హౌజ్ లో వేశారనే చర్చ ఉంది. క్వాలిటీ కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వ అధికారులైతే.. వారే మరో ప్రైవేట్ సంస్థతో నిజనిర్ధారణ చేసుకున్నారు. దీంతో మూరెడు జరగాల్సిన అవినీతి మూడు బారెడ్లకు చేరుకుంది.
మోటార్ల కొనుగోలు స్కాంతో పాటు మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుంది. 96 పంపులు, మోటార్ల వ్యవహారం ఎలా ఉంది? విద్యుత్ షాక్ లు ఏంటో మరో కథనంలో చూద్దాం.