– కన్నేపల్లి పంపులో ఖతమైన నిధులు
– ఎక్కడా దొరకకుండా ఏరికోరి అసెంబుల్డ్ ఫిట్టింగ్స్
– రూ.5,700 కోట్ల ఘరానా స్కాం
– ఆర్టీఐ ద్వారా వెల్లడించిన బీహెచ్ఈఎల్
– రూ.15 వేల కోట్ల మోటార్ల మోసం
– మేఘా ఒప్పందాలు బయటకు రాకుండా కహానీలు!
– కాళేశ్వరం కరప్షన్ కహానీ- పార్ట్ 3
క్రైంబ్యూరో, తొలివెలుగు:కాళేశ్వరం ప్రాజెక్ట్.. పేరుకే ప్రజల కోసం. కాంట్రాక్టర్ కి కాసులు కురిపించేందుకే అనేది నగ్నసత్యం. అందుకు మోటార్ల కొనుగోలే నిదర్శనం. 6, 8, 10, 11 ప్యాకేజీల్లో పంపులు, మోటార్ల కోసం రూ.7,349 కోట్లతో మేఘా, నవయుగలతో అగ్రిమెంట్ చేసుకుంది కేసీఆర్ సర్కార్. వాస్తవంగా ఎంత ధరకు ఈ పంపులు, మోటార్లు సరఫరా చేశారన్న వివరాలు ఆర్టీఐ ద్వారా కోరగా.. టీఆర్ఎస్ సర్కార్ ఏడాది అయినా సమాధానం ఇవ్వలేదు. దీంతో సప్లై చేసిన బీహెచ్ఈఎల్ ద్వారా సమాచారం సేకరించాల్సి వచ్చింది. ఈక్రమంలోనే కళ్లు బైర్లు కమ్మే నిజాలను అధికారులు బయటపెట్టారు. రూ.1,686 కోట్లకు మాత్రమే ఈ నాలుగు ప్యాకేజీలకు సరిపోయే మోటార్లు ఇచ్చామని తెలిపారు. అంటే ఇక్కడ స్కాం ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అక్షరాలా.. రూ.5,662 కోట్లు కొట్టేశారు.
ఒక్కొక్క ప్యాకేజీలో జరిగిన మోసం?
6వ ప్యాకేజీలో బీహెచ్ఈఎల్ సప్లై చేసిన మోటార్ల విలువ రూ.531 కోట్లు. ఇందుకు మేఘా, నవయుగ కంపెనీలు అగ్రిమెంట్ వాల్యూ రూ.2,251 కోట్లుగా చేసుకున్నాయి. వీటి మధ్యలో ఉన్న వత్యాసం రూ.1,720 కోట్లు. 6 ప్యాకేజీల మొత్తం విలువ రూ.4,823 కోట్లు. అంటే.. ఒక్క మోటార్లలోనే సుమారు రూ.1,720 కోట్లు కొట్టేస్తే.. ఇంకా సివిల్ వర్క్, టన్నెల్స్ లో చేసిన దందా కనీసం రూ.1000 కోట్లయినా ఉంటుంది.
8వ ప్యాకేజీలో బీహెచ్ఈఎల్ రూ.529 కోట్లకు మోటార్లను ఇచ్చింది. కానీ.. వీళ్లు మాత్రం రూ.2,548 కోట్లగా చెప్పారు. తేడా రూ.2,018 కోట్లన్నమాట. ఈ ప్యాకేజీ మొత్తం విలువ రూ.4,756 కోట్లు.
10వ ప్యాకేజీలో మోటార్లను బీహెచ్ఈఎల్ రూ.306 కోట్లకు సప్లై చేసినట్లు తెలిపింది. అయితే.. వాటినే ప్రభుత్వం దగ్గర రూ.1,117 కోట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్యాకేజీ విలువ మొత్తం రూ.2,648 కోట్లు. ఒక్క మోటార్ లోనే రూ.812 కోట్లు దోచుకున్నారు.
11వ ప్యాకేజీలో కూడా రూ.320 కోట్లకు మాత్రమే సప్లై చేసుకుంటే.. రూ.1,431 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే రూ.1,110 కోట్లు ఎక్కడికి వెళ్లాయి. ఈ ప్యాకేజీ విలువ రూ.3,672 కోట్లు.
బీహెచ్ఈఎల్ మోటార్ల స్కాం రూ.5,662 కోట్లు అంటే మిగితా వాటిల్లో ఎంత దొచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కడుపు కట్టుకుని అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామని చెప్పుకునే కేసీఆర్.. దీనిపై ఏం సమాధానం చెప్తారు.
అసెంబుల్డ్ మోటార్స్ కథేంటంటే?
ఇండియాలో పంపులు, మోటార్స్ కొంటే.. ఎప్పుడైనా ఈ స్కాం భయటపడే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో.. వివిధ దేశాల్లో ఉండే పరికరాలను తీసుకొని మోటార్లను ఒకే కంపెనీ అంటూ లేకుండా స్పెషలైజేషన్ అనే పేరు తగిలించి.. ఇష్టం ఉన్నట్లు రేట్లు వేసుకున్నారు. సినిమా థియేటర్లలో విడిగా అమ్మే పాప్ కార్న్ కు ఉండే రేట్, బిస్కెట్ ప్యాకెట్ పై ఉండే ఎమ్మార్పీ రేట్ కి చాలా తేడా ఉంటుంది. మామూలుగా ఎమ్మార్పీపై 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటేనే నిలదీస్తారు జనాలు. కానీ.. ఎలాంటి ప్యాకింగ్ లేని పాప్ కార్న్ కి మాత్రం ఎంత ఎక్కువ రేట్ పెట్టినా ఎవ్వరికీ ఫిర్యాదు చేయకుండానే కొనుగోలు చేస్తుంటారు. తూనికలు కొలతల శాఖకు కూడా అడిగే అధికారం ఉండదు. సేమ్.. మోటార్ల విషయంలో అసెంబుల్డ్ అనే పదంతో వేల కోట్లు దోచేశారు. మరో రూ.10 వేల కోట్ల స్కాం కేవలం మోటార్లలోనే జరిగాయని సాక్ష్యాధారాలు చెబుతున్నాయి.
ఒప్పందాలు బయటకు రావు?
ప్రభుత్వానికి, కాంట్రాక్టర్ కి వస్తువుల కొనుగోళ్లపై జరిగిన ఒప్పందం.. వాటి గ్యారెంటీ, వారెంటీ అసలు ఏలా ఉందో చెప్పరు. కాంట్రాక్టర్ అతనికి ఇష్టం వచ్చినట్లు రాసుకుని ఒప్పందాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు మోటార్లు నిండా మునిగిన తర్వాత ఈ విషయంపై చర్చ జరుగుతోంది. మిగులు బడ్జెట్ నుంచి అప్పుల తెలంగాణను చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆర్థికంగా ఖర్చులు భరించలేకపోవడంతో రచ్చరచ్చగా మారినట్లు తెలుస్తోంది.