– ప్యాకేజీల వారీగా అవినీతిమయం!
– ఇష్టమొచ్చిన రేట్లు.. మాయమైన కోట్లు!
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో సాక్ష్యాధారాలు
– సివిల్ వర్క్స్ లో 40 శాతం కమీషన్ తో సబ్ కాంట్రాక్ట్స్
– పనుల్లో నాణ్యత కరవు.. వీడియో, ఫోటోలకే కోట్లు
– మంత్రిని సైతం సైడ్ చేసిన వైనం!
– కాళేశ్వరం కరప్షన్ కహానీ- పార్ట్ 4
కాళేశ్వరం పేరుతో జరిగిన దోపిడీని తొలివెలుగు క్రైంబ్యూరో ఒక్కొక్కటిగా కథనాలు ఇస్తోంది. ఇప్పటివరకు ఇచ్చిన మూడు కథనాల్లో అనేక విషయాలపై ప్రజలకు క్లారిటీ వచ్చింది. ప్రాజెక్ట్ మాటున ఎంత దోచేశారో తెలుసుకున్నారు. అనవసర వాటికి తగలేసి.. లేని వాటికి ఎక్కువ రాసేసి ప్రజా ధనం ఎలా దాచేసుకున్నారో మరిన్ని వివరాలు ఇప్పుడు పార్ట్ 4లో చూద్దాం.
హరీష్ రావునే హరిగోసపెట్టిన కాంట్రాక్టర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులంటే దొచుకున్నోడికి దొచుకున్నంతగా మారింది. టెక్నికల్ ఇష్యూలను గాలికొదిలేసి సివిల్ వర్క్ లో 40శాతం కమీషన్ తో సబ్ కాంట్రాక్టు ఇచ్చిన కక్కుర్తే.. తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. ఎక్కడ ఏ కాలువ గట్లు తెగి ఊర్లు మునిగిపోతాయో అని భయం గుప్పిట్లో జనాలు ఉన్నారు. రెండేళ్ల క్రితం సిద్దపేట కొండపోచమ్మ నుంచి యాదాద్రికి వెళ్లే కుడి కాలువకు గండిపడింది. దీంతో శివారు వెంకటాపూర్ మునిగిపోయింది. మొన్నటికి మొన్న అన్నారం గ్రావిటీ కెనాల్ 6వ మైలురాయి వద్ద సిమెంట్ కూలిపోయింది. దశాబ్దాల కాలం పాటు ఎంతో పటిష్టంగా ఉండాల్సిన సివిల్ పనుల్లో నాసిరకం నిర్మాణాలు బయటపడుతున్నాయి. కన్నేపల్లిలోని లక్ష్మి పంప్ హౌజ్ మునిగిపోవడానికి గోడ నిర్మాణమేనని అనుమానాలు ఉన్నాయి. అయితే.. వీటన్నింటిపై అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినా వినలేదు. అది ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టేలా చేసిందంటే అతిశేయోక్తి కాదని సన్నిహితులు చెబుతుంటారు. మంత్రికి కూడా కమిషన్స్ రూపంలో కొట్టి పనులకు గండికొట్టారని ఇంజనీర్స్ చెబుతున్నారు. ఇదే విషయంపై కేసీఆర్ కి హరీష్ కి గ్యాప్ పెరిగిందని అంటుంటారు. కాలుకు బలపం కట్టుకుని తిరిగిన హరీష్ రావునే పక్కన పెట్టించే స్థాయికి కాంట్రాక్టర్ ఎదిగిపోయాడంటే ఎంత పవర్ ఫుల్ గా మారాడో అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రధాన ప్రతిపక్షం మేమే అంటున్న బీజేపీ నేతలు కాళేశ్వరం పంప్ హౌజ్ ల మునకపై మాట ఎత్తడం లేదంటే.. మేఘా కరప్షన్ పవర్ ఎంతవరకు వెళ్లిందో గమనించాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్యాకేజీల వారీగా దోపిడీ!
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కి అప్పట్లో 7 లింకులు, 28 ప్యాజీలుగా విభజించి పనులు ఎలా మొదలు పెట్టారో.. కాళేశ్వరం రీడిజైన్ లో కూడా అదే ఫాలో అయ్యారు. అప్పటికే చాలా పనులు పూర్తి చేశారు. వాటికి మెరుగులు దిద్దేందుకు డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టేశారు. ప్యాకేజీ 6, 8, 10లను ఒక్కసారి పరిశీలిస్తే వీరి వ్యవహారం ఈజీగా అర్థం అవుతుంది.
ప్యాకేజీ 6- అదనపు ఖర్చులు
ప్యాకేజీ 6లో అప్రోచ్ కెనాల్ కి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కి రూ.55 కోట్లు కేటాయించారు. మళ్లీ అదనంగా డ్రాప్ స్ట్రక్చర్ కి రూ.15 కోట్లు ఇచ్చారు. గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో ఎర్త్ వర్క్ లైనింగ్ కి రూ.10 కోట్లు.. సీఎం అండ్ సీడీ స్ట్రక్చర్స్ కు రూ.15 కోట్లు.. మళ్లీ అదనంగా రూ.12 కోట్లు కేటాయించారు. ఇన్ లేట్ రాంప్ తో పాటు ఇన్ టెక్ , పోర్టల్స్ కి రూ.22 కోట్లు అదనంగా మరో రూ.3 కోట్లు ఇచ్చారు. టన్నల్స్ కి రూ.925 కోట్లు, సర్జ్ పూల్ కి మొదటగా రూ.170 కోట్లు, ఆ తర్వాత రూ.151 కోట్లు.. ట్యూబ్ టన్నెల్ కి రూ.42 కోట్లు ఆ తర్వాత అదనంగా రూ.7 కోట్లు కేటాయించారు. హెచ్టీ టవర్స్ షిఫ్టింగ్, టెలీఫోన్ లైన్స్, వాటర్ పైప్స్ కు రూ.85 లక్షలు అనుకుంటే అదనంగా రూ.50 లక్షల బిల్లు పెట్టారు. దీంతో లెక్క రూ.1.35 కోట్లకు చేరింది. ఆఖరికి టెక్నికల్ ఏజెంట్స్ పేరుతోనూ రూ.50 లక్షల వరకు లాగారు.
ప్యాకేజీ 8- అదనపు ఖర్చులు
ప్యాకేజీ 8లో అంచనాలకు పూర్తయిన తర్వాత అమౌంట్ కు చాలా తేడా ఉంది. టన్నెల్ కు సంబంధించి ఎక్స్కవేషన్ ఆఫ్ టన్నెల్ మరియు లైనింగ్ కు సంబంధించి రూ.393.68 కోట్లు అనుకుంటే.. అదనంగా రూ.127.61 కోట్లు లాగారు. టోటల్ రూ.521.29 కోట్లకు చేరింది. గ్రావిటీ కెనాల్ లోని వివిధ పనుల కోసం రూ.99.84 కోట్లు అనుకుంటే ఇంకో రూ.40.73 కోట్ల అదనపు బిల్లులు పెట్టారు. మొత్తం రూ.140.57 కోట్లు లాగేశారు. లిఫ్ట్, సివిల్ కు సంబంధించి ‘ఏ’ భాగంలోని సర్జ్ పూల్స్, పంప్ హౌస్ సహా ఇతర పనుల కోసం రూ.405.40 కోట్లు అనుకుంటే అదనంగా రూ.392.16 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. మొత్తం రూ.797.56 కోట్లు అయింది. ఇందులో ఎంత పక్కదారి పట్టిందో అనేది తేలాలి. ఇక (బీ) భాగంలోని ఎలెక్ట్రో మెకానికల్ అండ్ హైడ్రో మెకానికల్ కు సంబంధించిన పనులు సబ్ టోటల్ కలుపుకుని రూ.1,730.31 కోట్లు అయితే.. ఎగస్ట్రాగా రూ.897.99 కోట్లు తీసుకున్నారు. టోటల్ రూ.2,628.29 కోట్లు అయింది. అలాగే ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ చార్జెస్, వ్యాట్ సర్వీస్ ట్యాక్స్, మెయింటెనెన్స్ స్కీమ్ అంటూ ఇలా రకరకాల వాటికి రూ.491.27 కోట్లు అనుకుంటే.. అదనంగా రూ.176.95 కోట్లు అయ్యాయి. మొత్తం కలిపి రూ.668.22 కోట్లు అన్నమాట. వీటన్నింటికీ నాన్ కాంట్రాక్ట్ పనులు రూ.285.70 కోట్లు కలుపుకుంటే.. మొత్తం వాల్యూ రూ.3,406.20 కోట్లు కాగా.. ఎగస్ట్రాగా రూ.1,635.44 కోట్ల బిల్లులు పెట్టారు. టోటల్ గా 8వ ప్యాకేజీలో రూ.5,041.63 కోట్లు ఖర్చు పెట్టారు. వీటిలో ఎన్ని సక్రంగా ఖర్చు అయ్యాయనే దానిపై అనుమానాలు ఉన్నాయి.
ప్యాకేజీ 10- అదనపు ఖర్చులు
10 ప్యాకేజీ విషయానికొస్తే.. అప్రోచ్ కెనాల్(3.40 కి.మీ) కోసం వివిధ పనుల కోసం ఐబీఎం రూ.60.11 కోట్లు అనుకుంటే అదనంగా రూ.11.75 కోట్ల బిల్లులు పెట్టారు. మొత్తం రూ.71.86 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పారు. లిఫ్ట్, సివిల్ పనుల కోసం రూ.219.85 కోట్లు అనుకుంటే ఎగస్ట్రాగా రూ.54.49 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం రూ.274.32 కోట్లు అయింది. ఇక ఎలక్ట్రో మెకానికల్ అండ్ హైడ్రో మెకానికల్ కోసం రూ.814.03 కోట్లు అనుకుంటే రూ.342.15 కోట్లు అదనం కలుపుకుని టోటల్ రూ.1,156.18 కోట్లు అని రాసుకున్నారు. ఫార్మేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ కోసం అయితే మరీ ఘోరం. ఐఎంబీ రూ.101.57 కోట్లు అయితే.. ఏకంగా రూ.316.99 కోట్లు అదనంగా ఖర్చు అయ్యాయని ఉంది. ఇక్కడ మొత్తం రూ.418.56 కోట్ల బిల్లులు పెట్టారు. ఇలా ఆరు దశల పనులకు రూ.1,598.79 కోట్లు అనుకుంటే.. రూ.2,324.17 కోట్లు అయ్యాయని రాసుకున్నారు.
ప్యాకేజీ 11- అదనపు ఖర్చులు
ఇందులో కూడా అదనపు ఖర్చులు గట్టిగానే అయ్యాయి. ఎక్స్కవేషన్ ఆఫ్ పూల్ కోసం ఐబీఎం అమౌంట్ రూ.147.30 కోట్లు అనుకుంటే.. మరో రూ.98.18 కోట్లు ఖర్చు అయ్యాయని చెప్పారు. పంప్స్, మోటార్స్, ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ వర్స్ రూ.957.03 కోట్లు అనుకుంటే.. అదనంగా రూ.474.62 కోట్లతో కలిపి రూ.1,431.65 కోట్లు అయ్యాయి. ఫార్మేషన్ ఆఫ్ రిజర్వాయర్ పనుల్లో రూ.93.48 కోట్ల అంచనాకు రూ.583.76 కోట్లు ఎగస్ట్రాగా ఖర్చు అయ్యాయి. మొత్తం రూ.677.24 కోట్లు అన్నమాట. ఇలా ఒక్కో ప్యాకేజీలో అదనపు ఖర్చులు, వేస్టేజ్ లు బాగానే జరిగాయని తెలుస్తోంది. వాటిలో ఎంత మొత్తం మేఘా పక్కదారి పట్టించింది అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులెన్ని..? ఎలా చెల్లిస్తారు..? ఆ అధికారం ఎవరికి ఉంది..? ప్రభుత్వం గ్యారెంటీనా..? ఏఏ బ్యాంకుల్లో ఎంత మొత్తం తీసుకున్నారు..? కాళేశ్వరం కథలు- పార్ట్ 5లో చూద్దాం.