– కాళేశ్వరం పాపాల్లో అధికారులు!
– ఈఎన్సీ హరిరామ్ అరాచకాలు
– గజ్వేల్ లో కేసీఆర్ తో సమానంగా ఆస్తులు
– త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ?
– కూపీలాగే కొద్దీ పెరుగుతున్న భయం
– ప్రాజెక్ట్ మాటున భారీ దోపిడీ
– ఎవరినీ వదిలేదు లేదు..
– తొలివెలుగు క్రైంబ్యూరో కథనాలు
– కాళేశ్వరం కరప్షన్ కహానీ- పార్ట్ 6
క్రైంబ్యూరో, తొలివెలుగు:ప్రజల సొమ్ముని గోదావరి నదిలో ఎందుకూ పనికిరాకుండా పోసిన వారినెవ్వరినీ తొలివెలుగు వదిలిపెట్టదు. ఇప్పటి దాకా పాలకుల బాగోతాన్ని బయటపెట్టాం. కాంట్రాక్టర్ అక్రమ దొపిడీ వెలికి తీశాం. ఇప్పుడు అధికారుల రాజభోగాలు వెలుగులోకి వచ్చాయి. లక్షకోట్ల ప్రాజెక్ట్ పాపాల్లో తిలా పాపం తలా పిడికెడు ఉంది. అధికారుల్లో ఐఏఎస్ రజత్ కుమార్ రాజభోగాలకే పరిమితమైతే.. ఈఎన్సీ హరిరామ్ అంతా తానై అరాచకం నడిపించారు. ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. అక్రమంగా వందల కోట్లు సంపాదించి.. తొండముదిరిన తర్వాత ఊసరవెల్లి అయినట్లు.. రాజకీయ ప్రవేశానికి సిద్ధమౌతున్నారు. తిన్నదంతా కక్కిస్తేనే అధికారుల్లో భయం ఉంటుంది. భావితరాల కోసం ఆలోచిస్తే ఇంగిత జ్ఞానం వస్తుంది. ఇంతలా అనాల్సి రావడానికి కారణం ఉంది. హరిరామ్ అవినీతి, ఆరాచకం, అక్రమాలు, జల్సాలు చూసి మీరుకూడా ఆశ్చర్యపోతారు. కేసీఆర్ రాజకీయాలు మాత్రమే చూసుకోవడంతో పాలన అంతా ఇలాంటి వారి చేతిలోనే నడుస్తోంది. గజ్వేల్ లో జరిగే కాళేశ్వరం ముఖ్యమైన పనులు అన్నీ ఈయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి.
ఇంతకీ ఎవరీ హరిరామ్?
అంత్యంత చిన్న వయసులోనే ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా అక్రమంగా పదోన్నతి పొందాడు. ఇరిగేషన్ ఇంజనీర్లలో 32 ఏళ్లుగా ప్రమోషన్స్ లేకుండా ఉన్నవారెందరో ఉన్నారు. ప్రమోషన్స్, రూల్స్ లేకుండా ఉన్న వ్యవస్థ ఇదే. దీంతో అక్రమార్కులదే రాజ్యం అవుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుర్చీని ఆక్రమించాడు. ఆ తర్వాత అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇదంతా 2011 కథ. అడ్ హక్ కమిటీ ఈయన సీనియార్టీ లిస్ట్ ని పక్కన పెట్టింది. కానీ.. ఈఎన్సీ గజ్వేల్ గా నియమించింది ప్రభుత్వం. ఇది ఎలా జరిగిందని మాత్రం ఎవరూ అడగొద్దు.
ఈయనే కాదు.. మేడం కూడా పదేళ్లుగా అక్కడే?
హరిరామ్ ఈఎన్సీ గజ్వేల్ అయితే ఈయన మేడం డిప్యూటీ ఈఎన్సీ అడ్మిన్. ఈమెదే అత్యంత కీ పోస్ట్. ఏఈఈలు, డీఈఈలను ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. ఆ పోస్ట్ అలాంటిది మరి. ఇలాంటి పోస్ట్ లో ఈమె బదిలీ కాకుండా 10 సంవత్సరాల పాటు కొనసాగుతుందంటే ఎన్ని విధాలుగా వారి కుటుంబం ఇరిగేషన్ శాఖను గుప్పిట్లో పెట్టుకుందో అర్థమౌతోంది. 10 ఏళ్లు ఒకే కుర్చీ కావడంపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ పోస్ట్ కోసం లాబీయింగ్ మొదలు పెట్టింది. మొత్తానికి ఇరిగేషన్ మొత్తం ఈ భార్యాభర్తల చెప్పుచేతల్లో ఉండబోతోందని ఆ శాఖలో సిబ్బంది భయపడుతున్నారు.
మేఘా వాటాలు ఎంతంటే?
కాళేశ్వరం నీటిపారుదల కార్పొరేషన్ నుంచి ఎలాంటి రుణాలు తీసుకున్నా.. ఈఎన్సీ హరిరామ్ సంతకమే ముఖ్యం. ఈయన వద్ద నుంచే సొమ్ము మేఘాకు చేరుతుంది. ఇలా కాళేశ్వరం పైపులు, మల్లన్న సాగర్, కొండపొచమ్మ, రిజర్వాయర్ల నిర్మాణం అంతా ఈయనే చూసుకుంటారు. ఇప్పటివరకు హరిరామ్ చేతి ద్వారా కాంట్రాక్టర్స్ కి రూ.35,000 కోట్ల చెక్ లు అందాయి. అందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరగాలంటే పర్సంటేజ్ కామనే. ఈ మూడేళ్లలోనే వందల కోట్ల సంపద పోగేసుకున్నారని వినికిడి. ఇదే కాకుండా.. నిత్యం ఖర్చుల కోసం భార్యాభర్తల ప్రైవేట్ డ్రైవర్స్ కి మేఘా నుంచి ప్రత్యేక వేతనం ఇస్తున్నారని సమాచారం.
ఎవరికీ సాధ్యం కానిది హరిరామ్ కే అవుతుంది?
ఈయన గురించి డిపార్ట్ మెంట్ లో పుంఖానుపుంఖాలుగా చెప్పుకుంటారు. అయ్యగారి సేవలు ఒక్క శాఖా పరంగానే కాదు. అన్ని విధాలుగా ఎవరికి ఏది కావాలన్నా సమకూర్చేస్తారు. వీటన్నింటికీ ఓరోజు సమాధానం వస్తుందని అనుకుంటున్నారు. నిత్యం ఢిల్లీ, విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అయితే.. పేరుకు ఆఫీషియల్ అని చెప్పుకున్నా.. జల్సాల్లో ఎక్కడా వెనక్కి తగ్గదిలే అంటారని గుసగుసలు ఉన్నాయి. ఉన్నతాధికారులను నయానో కాదు.. భయానే గుప్పిట్లో పెట్టుకుంటారట. వారి వ్యక్తిగత, ఆఫీస్ లో ఉన్న లోపాలు మీడియాకు లీక్ చేస్తానని తన సీట్ ని పదిలంగా ఉంచుకుంటూ ఇరిగేషన్ శాఖను ఏలుతున్నారని లోగుట్టు.
వీరి సంపద ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి?
ఈ జంట సంపద మొత్తం మార్కెట్ విలువ రూ.500 నుంచి రూ.600 కోట్లు ఉంటుంది. గజ్వేల్ లో ఒకే చోట కేసీఆర్ కి సమానంగా 70 ఎకరాల ఫాంహౌజ్ ఉంది. ఇదంతా బంధువులు, కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి పేర్లతో ఉంటుంది. బినామీ యాక్ట్ ప్రకారం దర్యాప్తు చేస్తే.. ఎవరెవరు ఎంత సంపాదించారో ఎంత ఆస్తులు ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఉండేది ఓ అల్ట్రా పాష్ విల్లాలో. హైదరాబాద్ గోల్డ్ కోర్స్ దగ్గరల్లో నివాసం ఉంటున్నారు. 3 ప్రభుత్వ వాహనాలు వీరి కోసం నిత్యం అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ డ్రైవర్స్ కాకుండా ప్రైవేట్ వాళ్లని కూడా పెట్టుకుని వ్యవహారం పొక్కకుండా నడిపిస్తుంటారు.
పొలిటికల్ ఎంట్రీ?
గతంలో యాక్టర్ అయినా, డాక్టర్ అయినా సంపద ఎక్కువైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు ఐఏఎస్ లు, అధికారులే డబ్బు ఇబ్బడిముబ్బడిగా సంపాదించి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అందుకు సిద్దిపేట మాజీ కలెక్టరే ఉదాహరణ. అయితే.. ఇప్పుడు హరిరామ్ కూడా ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. అందుకు నిరంతరం మూడు ప్రధాన పార్టీల పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.