– హాట్ టాపిక్ గా జూబ్లీహిల్స్ సొసైటీ కార్యవర్గ విభేదాలు
– తొలివెలుగు ఇంటర్వ్యూలో సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
– కక్ష సాధింపా..? సహకారమా..? తేల్చుకోవాలని సవాల్
– పాత కమిటీ అక్రమాలు వెలికి తీస్తాం..
– అందుకే సభ్యులు గెలిపించారంటున్న కొత్త కమిటీ
జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది తొలివెలుగు. 15 ఏళ్ల నుంచి ఏం జరిగిందో.. చూపిస్తూ సంచలన కథనాలు ఇస్తోంది. ఈక్రమంలోనే కొత్త కమిటీలో విభేదాలు భగ్గుమన్నాయి. అసలేం జరిగింది..? ఇష్యూ పోలీసుల వరకు ఎందుకు వెళ్లింది..? సెక్రటరీ మురళీ ముకుంద్ తో పాటు కొంతమంది సభ్యులను కలిసి వివరాలు సేకరించింది తొలివెలుగు.
తొలివెలుగు ఇంటర్వ్యూలో మురళీ ముకుంద్ ఏమన్నారంటే..?
ఫైళ్లు మిస్సింగ్ జరిగాయని నేను గుర్తించా. పాత కమిటీ కాలంలోనే కొన్ని ఫైళ్లు పోయాయి. సీబీసీఐడీ దర్యాప్తులో వారు తీసుకెళ్లారు. విజిలెన్స్ వారు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరు తీసుకెళ్లినా వాటి వివరాలు మాత్రం మా వద్ద ఉండాలి. బై లా ప్రకారం ఫైళ్ల భద్రత నాపైనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మిస్ కావొద్దనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను.
విభేదాలకు కారణాలేంటి..?
సొసైటీ వ్యవహారాలు కార్యాలయంలో జరగాలి. కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ.. అలా జరగడం లేదు. అన్ని వారి మీడియా హౌస్ లోనే జరుగుతాయి. అక్కడ వారి కుటుంబ సభ్యుల జోక్యంతోనే ఏం చేయాలో పథకం ప్రకారం చేస్తారు. అలాంటప్పుడు ఈ కొత్త కమిటీ ఎందుకు..? అందరం కొత్త వాళ్లమే. పాలన గురించి నిర్ణయాలు ఎలా ఉంటే సభ్యులకు మేలు జరుగుతుందో ఎవ్వరికీ ఏం తెలియదు. కుటుంబ సభ్యుల జోక్యంతోనే మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అంతా ఆ మీడియా హౌస్ నుంచే.. ఎందుకలా..?
ఇటీవలి కాలంలో జరిగిన 360 గజాల స్థలం కేటాయింపులు ఆ మీడియా హౌస్ నుంచే జరిగాయి. గత కమిటీ కంటే.. మనం ఎక్కువ ఎలా సంపాదించాలనే అత్యాశనే ప్రెసిడెంట్ కుటుంబ సభ్యుల పథకంలా కనిపిస్తోంది. ప్రతీ అంశం గతంలో జరిగిన వ్యవహారాల్లో జోక్యం చేసుకొని… వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేయాలి.. ఎలా బెదిరించాలనే ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. గతంలో తప్పులు జరిగాయి. కానీ.. వాటిని మాత్రమే ఎత్తి చూపడం కాదు. అందుకు ప్రభుత్వం ఉంది. విచారణ కమిటీలు ఉన్నాయి. మనం ఇప్పుడు సభ్యులకు ఏం చేయాలి. వారికి ఇళ్ల స్థలం ఇవ్వలేనప్పుడు.. ఉన్న జాగాలో ఎలా నివాసం కల్పించాలో ఆలోచించాలి. కానీ.. వారంతా దోచుకోవడం కోసం.. బ్లాక్ మెయిల్ కోసం కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని తెలుస్తోంది.
మీడియా ముసుగులో దందాలు.. వారి నుంచి రక్షించాలి
ఫోర్త్ ఎస్టేట్ వెనుక సొసైటీ బాగోతాలు. గతంలో చేసింది ఇంతే. ఇప్పుడు కూడా అదే పద్దతిలో వెళ్లాలని చూస్తున్నారు. సో ఈ విషయాలు అన్నీ సీఎం దృష్టికి వెళ్లాలి. ఆధారాలతో తీసుకెళ్తాం. వేల కోట్ల విలువచేసే అస్తులు ఉన్న ఈ సొసైటీ ఇంకా చేయాల్సింది ఏం లేదు. కాబట్టి వెంటనే మున్సిపాలిటీలో కలిపివేసి అన్ని బాగోగులు వారికి అప్పగించాలి. గతంలో జరిగిన తప్పిదాలపై కమిటీలు వేసి దర్యాప్తు జరిపించాలి.
అధికారాల్లో కోత పెట్టాలంటే.. తప్పు చేయాలి
నా అధికారాలను తప్పించే అధికారం వాళ్లకు లేదు. నేను తప్పు చేస్తే నిరూపించి.. ఆ తర్వాత కోత పెట్టవచ్చని బై లా లో ఉంది. కానీ.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మూడేళ్ల పాటు నన్ను ఎవరూ ఏం చేయలేరు. సభ్యుల సంక్షేమం కోసమే పాటు పడతా. బ్లాక్ మెయిలింగ్ కోసమే అయితే నాకీ పదవి వద్దు.
ఫోరెన్సిక్ ఆడిటింగ్ వెనక పెద్ద స్కెచ్ ఉంది- సొసైటీ సభ్యులు
ఫోరెన్సిక్ ఆడిటింగ్ బ్లాక్ మెయిలింగ్ కోసమే జరపాలని అనుకుంటున్నారు. గతంలో తక్కువ డబ్బులకు, ఎక్కవ మొత్తం తీసుకున్నారు. దాంతో అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వారి వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం కోసమే ఈ డ్రామాలు. సభ్యులందరినీ ఇబ్బంది పెట్టడానికా ఉంది.. వారి బాగు కోసమా..? 15 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారాలు బయటకు తీయడమంటే.. ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించాలో అనే దురుద్దేశం కోసం కాదా..? ఒక వేళ అప్పటి కమిటీ తప్పు చేస్తే.. వారికి శిక్ష ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ.. ఆ ఫైళ్లలో వారు లబ్ధి పొందారు.. ఈ ఫైళ్ల ద్వారా వీరికి డబ్బులు వచ్చాయి అని తవ్వడం సరైన పద్దతి కాదు. ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులు పాత కమిటీ ఎంత సంపాదించారో.. ఇప్పుడు వారికంటే ఎక్కువ ఎలా సంపాదించాలి.. ఏం చేయాలో అది చేస్తామని మీడియా హౌస్ నుంచి నడిపిస్తున్నారు. కానీ.. ఏ ఇబ్బంది కలిగినా సొసైటీలో కార్యదర్శి పేరు ప్రతిష్టలే దెబ్బ తింటాయి. అందుకే వారు చేసే తప్పుడు పనులకు సెక్రటరీ అడ్డు తగులుతున్నారు.
గత కమిటీ అక్రమాలను వెలికితీయడమే మా లక్ష్యం- కొత్త కమిటీ ప్రకటన
మరోవైపు కొత్త కమిటీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు బాధను కలిగించాయని తెలిపింది. కొత్త పాలకవర్గం గురించి కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. గత కమిటీ అక్రమాలను వెలికి తీయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అసలు.. సభ్యులు తమను గెలిపించింది అందుకేనని చెప్పుకొచ్చింది కొత్త కమిటీ.