– సాఫ్ట్‌గా ముంచేస్తున్న సాస్ ఇన్‌ఫ్రా..
– శ్రీయాస్ కన్‌స్ట్రక్షన్ లీలలు ఎన్నెన్నో
– కిరీటం పేరుతో శఠగోపం పెడుతున్న సాస్ క్రౌన్
– పేరు ఎదైనా.. దోచుకోవడం.. దాచుకోవడమే
– ప్రీ లాంచ్ పేరుతో అరచేతిలో వైకుంఠం
– ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే నాలుగో వంతు అమ్మకాలు.
– తొలివెలుగు స్టింగ్ ఆపరేషన్‌లో కన్‌స్ట్రక్షన్ కంపెనీల బాగోతం
ఆలూ లేదు… చూలూ లేదు.. కానీ కొడుకు పేరు కోటీశ్వరుడు అన్నట్టుంది హైదరాబాద్‌లో కొన్ని కన్‌స్ట్రక్షన్ కంపెనీల తీరు. పునాదులు కూడా తీయని నిర్మాణాలను చూపించి కస్టమర్లను అడ్డంగా బోల్తా కొట్టిస్తున్నాయి. భవిష్యత్‌పై అత్యాశను కల్పించి.. వారి కష్టార్జితాన్ని గద్దల్లా ఎగరేసుకుపోతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కోట్ల రూపాయలను కొల్లగొట్టి.. చివరికి వారికి ఎగనామం పెట్టేస్తున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివి.. లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగాలు చేసేవారు కూడా.. చాలా ఈజీగా ఆ సంస్థల చేతికి చిక్కిపోతున్నారు.
ఐటీ కారిడర్ కోర్ ఏరియాలో భూములు తీసుకుని.. ఫ్రీ లాంచ్ పేరుతో కొన్ని పెట్టుడు కంపెనీలు భారీ అక్రమాలకు తెరతీస్తున్నాయి. కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా పెట్టుకుని.. రెండు మూడు కంపెనీలతో భారీ స్కామ్ చేస్తున్నాయి. అలా ఖాజాగూడలో ఐ టవర్ పేరుతో.. సాస్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ కంపెనీ, సహా మరో రెండు కంపెనీలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న బాగోతం తాజాగా తొలివెలుగు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది.
80 లక్షల స్క్వేర్ ఫీట్.. బిజినెస్ బిల్డింగ్.. రూ. కోటి రూపాయల పెట్టి వేయి ఫీట్ల ప్లాట్ కొంటే.. నెలకు రూ.60 వేల అద్దె పక్కా.. ఒక కస్టమర్‌ను ఆకర్షించడానికి ఇంతకంటే ఎక్కువ మాటలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అందుకే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్… ఇంకా గ్రౌండ్ లెవెల్ కూడా దాటకముందే అప్పుడే 20 లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియాను ఈజీగా అమ్మేశారు. కనీసం రేరా అనుమతులు కూడా రాకుండానే వందల కోట్ల రూపాయలని జేబులో వేసుకున్నారు నిర్వాహకులు. రూల్స్ కి విరుద్ధం అని తెలిసినా పకడ్బందీగా ప్లాన్ అమలు చేశారు. మరోవైపు కస్టమర్లు కూడా ముందూ వెనకా ఆలోచించకుండానే కోట్ల రూపాయలు వారి చేతిలో పెట్టి.. ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.
వేయి ఫీట్ల స్థలం బిల్డింగ్‌లో ఎక్కడ వస్తుందో తెలియదు. కాని కొందరు అప్పుడే నిర్వాహకులు చేతిలో కోటి రూపాయలు మాత్రం పెట్టేశారు. మరో విచిత్రం ఏమిటంటే కన్‌స్ట్రక్షన్ కంపెనీ అద్దె ఎవరికి ఇచ్చినా.. కొనుగోలు చేసిన వారికి సంబంధం ఉండదు. ఒకవేళ తమకే వేరే అవసరం వచ్చి.. తమ వేయి ఫీట్ల ఎరియాను అమ్ముకోవాలంటే.. ఎవరికి అమ్ముకోవాలో, ఎలా అమ్ముకోవాలో కూడా క్లారిటీనే లేదు. కంపెనీ ఓ నెంబర్ కేటాయించి ఈ ప్లోర్‌లో మీస్థలం ఉందని చెప్తే.. ఊహించుకుని సంతోషపడాల్సిందే. ఇదంతా పక్కన బెడితే.. అంతంత అద్దె చెల్లించే టాప్ కంపనీలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు అద్దెకు తీసుకుంటారో.. వినియోగదారునికి ఎప్పుడు రెంట్ చేతికొస్తుందే.. అంతా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇష్టం . ఐ టవర్‌లో నాకు స్థలముందని చెప్పుకోవడాకే కానీ.. అక్కడ అంతా మిథ్య.
శ్రీయాస్ కస్టమర్లకు శ్రీ అంజనేయ స్వామినే దిక్కు
శ్రీ అంజనేయస్వామి పేరు పెట్టుకొని.. అభయహస్తం లేకుండానే అడ్డంగా దొచుకుంటోంది మరో కంపెనీ. రేరా అనుమతులు లేవు. పునాదులు తీయలేదు. కానీ మూడున్నర బెడ్ రూంల నివాస సముదాయం.. మొత్తం 430 ప్లాట్స్ అంటూ.. జస్ట్ సెల్లార్ చూపించి ఇప్పటికే 4వ వంతు నిర్మాణాన్ని అమ్మేసింది. కాలయాపన చేస్తూ వినియోగదారుల పెట్టుబడిని కంపెనీలకు మళ్లీస్తోంది. అయితే రేరా అనుమతులు లేకుండా 110 మందికి ఎలా అమ్మకం జరిపారు. వారి నుంచి వసూలు చేసిన రూ. 50 కోట్ల సొమ్ము ఎవరి అకౌంట్లోకి వెళ్లిందో తేలాల్సి ఉంది.
కిరీటం పేరుతో నేలను నాకిస్తున్న మరో బ్యాచ్
మూడేళ్లలో ఒక్క ప్రాజెక్ట్‌కు సరైన రూపం తీసుకురాలేని సంస్థ. క్రౌన్ (CROWN) పేరుతో మరో దందా మొదలు పెట్టారు. నాలుగున్నర ఎకరాల్లో 57 అంతస్తుల హైరేంజ్ విల్లాలు అంటూ అనుమతులు తీసుకున్నారు. ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒక్కొక్క అపార్ట్‌మెంట్ అంటూ.. 230 లగ్జరీ నివాసాలతో ఇటీవల నిర్మాణం ప్రారంభించారు. కానీ అప్పుడే ఇందులో కూడా 54 ప్లాట్స్ అమ్మకం జరిపారు. ప్రారంభ ధర ఏకంగా రూ. ఆరున్నర కోట్లు. కానీ పునాది తీయకుండానే కోట్ల రూపాయలు తీసుకోవడంతో వినియోగదారుల్లో టెన్షన్ మొదలైంది. అటు ఇప్పటికే ఇలా వసూలు చేసిన రూ .127 కోట్లను జీఎస్టీ చెల్లించకుండా అక్రమ మార్గాలు ఎంచుకున్నారన్న అరోపణలు ఉన్నాయి. కమర్షియల్ స్పేస్ .. డౌన్ టౌన్ .. క్రౌన్.. ఇలా పేరు ఏదైనా ఇప్పటికి ఒక్క నిర్మాణం పూర్తి చేయని కంపెనీలు.. భారీగా, అదీ అక్రమంగా పెట్టుబడులు సేకరించి ఏం చేస్తారనేది అందోళన కలిగిస్తోంది.
అసలు ఎలా ట్రాప్ చేస్తారు?
హంగూ అర్భాటాలు.. పత్రికల్లో ఆకాశానికెత్తే కథనాలే ఈ కంపెనీలకు ప్రధాన అస్ర్తం. వాటి సాయంతో ఈజీగా కస్టమర్లను బుట్టలో వేసుకోవడం ఈ అక్రమార్కులకు వెన్నతో పెట్టిన విద్య. అదే రీతిలో తొలివెలుగు ప్రతినిధులకు మస్కా కొట్టబోయింది ఈ ఫేకుడు గ్యాంగ్. ఈ క్రమంలో తొలివెలుగు స్టింగ్ అపరేషన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ ఆ కళ్లు బైర్లు కమ్మే నిజాలు.. ఇలాంటి వారి బారిన పడకుండా కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్టింగ్ ఆపరేషన్‌లో.. మరో కథనం రూపంలో తెలుసుకుందాం.. ( ఇంకా ఉంది..)