సినిమా ఇండస్ట్రీలో ఫాన్స్ ఫాలోఇంగ్‌ను క్యాష్ చేసుకోడంలో చట్టం.. గిట్టం… జాన్తా నై… నో రూల్స్.. టార్గెట్ మనీ కలెక్షన్స్. ఇదీ సైరా టీమ్ నయా ప్లాన్..
చరిత్ర ఎవరి సొంతం? ఓ మహాయోధుడి జీవిత కథ వందేళ్ళ తర్వాత చరిత్ర అవుతుంది కదా? చట్ట ప్రకారం దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చని అందరికీ లెక్చర్ ఇచ్చిన మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తేజకు ఫాన్స్ ఆసక్తిని సొమ్ముచేసుకునే విషయంలో మాత్రం చట్టం గుర్తుకు రాకపోవడమే ఆశ్యర్యం ! అందుకే మూవీ రిలీజుకు ముందే అడ్డం పడి అభిమానుల నుంచి అడ్డంగా దోచుకుంది. అడ్వర్టయిజ్మెంట్ కేటగిరిలోకి వచ్చే సినిమా ట్రైలర్‌ను చూడ్డానికి ఫాన్స్‌ను నిలబెట్టి మరీ టిక్కెట్టుకు రెండొందలు కలెక్టు చేసుకున్న వైనం ‘తొలివెలుగు’ దృష్టిలోకొచ్చింది.
చట్టాన్ని అతిక్రమించి సైరా బృందం అడ్డంగా చేసిన అడ్డగోలు ట్రైలర్ బిజినెస్‌పై ‘తొలివెలుగు’ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.
ఏదైనా ఒక సినిమా ధియేటర్లలో ప్రదర్శించి టిక్కెట్ల అమ్మకం ద్వారా సొమ్ము చేసుకునే వీలు చట్టంలో ఉంది. అదీ టిక్కెట్ రేటు పెంచాలన్నా, స్పెషల్ షో వేయాలన్నా సంబంధిత అధికారుల అనుమతి అవసరం. కానీ సినిమా పబ్లిసిటీనే సినిమాగా చూపించి డబ్బు దండుకున్న దాఖలా టాలీవుడ్ లో ఇప్పటి దాకా లేదు. ఇప్పుడు ఘనత వహించిన సైరా మూవీ బృందం రూల్స్ ధిక్కరించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 కి పైగా ధియేటర్లలో ఒక్కో టిక్కెట్ 200 రూపాయల చొప్పున ఫాన్స్ కు, సినీ ప్రేక్షకులకు అమ్మి సొమ్ము చేసుకుంది.
సైరా ట్రైలర్ కేవలం చిత్ర ప్రమోషన్ కార్యక్రమం. ఇది ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా చూపిస్తారు. కొందరైతే కార్యక్రమానికి వచ్చిన ఫాన్స్‌ను అతిథులుగా భావించి రిఫ్రెష్ మెంట్స్‌తో మర్యాద చేస్తారు. కానీ సైరా టీం దాన్ని రివర్స్ చేసింది. ట్రైలర్ కూడా టిక్కెట్లు అమ్మి చూపించింది. ఇది కచ్చితంగా చట్ట విరుద్ధమే.
సైరా చిత్రం ధియేటర్లలో టిక్కెట్లు పెట్టి ప్రదర్శించిన వ్యవహారానికి సంబంధించి తొలివెలుగు దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. దియేటర్ల లిస్టు, అమ్మిన టిక్కెట్లు సేకరించడం జరిగింది. హైదరాబాద్ సహా నైజాంలో 10, గుంటూరు జిల్లాలో 6, ఈస్ట్ గోదావరి జిల్లాలో 18, వెస్ట్ గోదావరి జిల్లాలో 13, విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 9, విజయవాడ సహా కృష్ణా జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 16, సీడెడ్ (రాయలసీమ జిల్లాలు)లో 21 మొత్తం 96 దియేటర్లలో సైరా ట్రైలర్ టిక్కెట్‌పై ప్రదర్శించారు.
ట్రైలర్ సహజంగా ఏదైనా మూవీ మధ్యలో ఫ్రీగా ఇంటర్వెల్ సమయంలో వేయడం అనాదిగా వస్తోంది. అలా కాకుండా సెపరేట్ షోగా టిక్కెట్‌పై వేయాలంటే ప్రత్యేక పర్మిషన్ కావాలి. దీనికి ప్రభుత్వం జీవో లాంటి ఉత్తర్వులు రిలీజ్ చేయాలి. కానీ సైరా టీము ఆ విషయం ఏమీ పట్టించుకోలేదు.
సైరా నిర్మాత రాం చరణ్ గారూ ఇదేమి నిర్వాకం!? ఇలా కూడా మీరు సొమ్ము చేసుకుంటారా? దీనికి మీరు ఏమి సమాధానం చెబుతారు..? సైరా హీరో మెగాస్టార్ ట్రైలర్ బిజినెస్ పై ఏమంటారు? చరిత్రను ఇలా కూడా క్యాష్ చేసుకుంటారా?
ట్రైలర్ స్క్రీనింగ్ కోసం మీరు కలెక్టు చేసిన అమౌంటు లీగల్ అని అనుకుంటే ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కట్టారు? అసలు కట్టారా? కట్టాలని అనుకుంటున్నారా? ప్రభుత్వాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? ట్రైలర్ అంటే షో మధ్యలో వేయాలి. లేదా సెపరేట్ షో రూపంలో వేసి టిక్కెట్ ఇష్యూ చేస్తే దానికి ప్రత్యేకమైన అనుమతి కావాలి. అలాంటి అనుమతి మీదగ్గర వుందా రామ్ చరణ్? జీవోలాంటిదేదైనా వుందా మీదగ్గర?
ఔరా ? సైరా?