కళాకారుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ‘చెత్త’శుద్దికి నిదర్శనం ఇది. తన మాటలతో, పాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన కళాకారుడి కుటుంబానికి దక్కిన గౌరవం ఇది. కళాకారులను ఆదుకోవడండంలో కేసీఆర్ సర్కార్ మాటలే కోటలు దాటుతాయే తప్ప.. సాయానికి చేయడానికి మాత్రం చేతులు రావని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదేమో. మాట్లాడితే కళాకారులను నెత్తిన పెట్టుకునే ప్రభుత్వమని చెప్పుకునే టీఆర్ఎస్.. ఓ కళాకారుడు, ఉద్యమకారుడు చనిపోతే మాత్రం చిన్న సాయం కూడా చేసింది లేదు. టీఆర్ఎస్ ఆఫీస్, సీఎంవోల చుట్టూ సాయం కోసం తిరిగి అలసిపోయి, విసిగిపోయిన కళాకారుడి కుటుంబం ఆవేదన ఇది.
జై శ్రీనివాస్.. ఈ పేరు వినిపిస్తే చాలు, ఎవరికైనా ముందుగా ఆయన గొంతునుంచి జాలువారిన దేశం మనదే పాట గుర్తుకొస్తుంది. కానీ ఆ పాట వింటే ఆయన కుటుంబానికి మాత్రం దుఃఖం ముంచుకొస్తుంది. మూడునెలల క్రితం కరోనాతో కన్నుమూశారు జై శ్రీనివాస్. చికిత్స కోసం రూ.29 లక్షల వరకు ఖర్చయ్యాయి కానీ ఆయన మాత్రం బతకలేదు. చికిత్సకు సాయం చేస్తానని మాటిచ్చిన టీఆర్ఎస్, మంత్రి కేటీఆర్ దాన్ని నిలుపుకోలేదు. దీంతో తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బు, దాతల సహకారంతో ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది శ్రీనివాస్ కుటుంబం. ఇదంతా జరిగి మూడు నెలలు. కట్ చేస్తే.. జై శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. ఇంటికి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉంది. శ్రీనివాస్ కూతుళ్లు ఇద్దరు , ఆయన భార్య స్వాతి దిక్కులేనివారయ్యారు. అండగా నిలిచేవారు లేకపోవడంతో మూడు నెలలుగా కన్నీళ్లతో కడుపునింపుకుంటున్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుగా తెలంగాణ ఉద్యమ గీతాలను ఆలపించి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు శ్రీనివాస్. తెలంగాణ జాగృతి కోసం ఆయన పాడిన పాటలను విని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఎంతగానో ప్రశంసించారు. కానీ ఆయన చనిపోయాక మాత్రం ఎవరూ కూడా ఆయన కుటుంబాన్ని పలకరించింది లేదు. ప్రభుత్వమూ పట్టించుకున్నది లేదు. కేసీఆర్ అయితే.. జై శ్రీనివాస్ మరణం పట్ల సానుభూతి ప్రకటన చేసి.. అదే పెద్ద సాయమన్నట్టుగా చేతులు దులుపుకున్నారు.
కళాకారులను ఆదుకునేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి పేరుతో ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ శ్రీనివాస్ చనిపోతే ఆ సంస్థ ఆయన కుటుంబం వైపు చూసింది లేదు. ఉద్యమగీతాలే కాదు.. అనేక సినిమాలకు పాటలు పాడారు శ్రీనివాస్. కనీసం ఆ కోటాలోనైనా సాయం చేసింది లేదు ప్రభుత్వం. సినీ కళాకారుల కోసం చిత్రపురిలో మహా గొప్పగా ఇళ్లు నిర్మించామని పదే పదే చెప్పుకుంటుంది టీఆర్ఎస్. అందులోనైనా శ్రీనివాస్ కుటుంబానికి ఓ ఇంటిని ఇచ్చి ఆదుకున్నది లేదు. శ్రీనివాస్ గతంలో సాయం చేసిన వారు ఎవరో కొందరు అందించే రేషన్ సరుకులే ఆ కుటుంబానికి ఆధారం అయ్యాయి. ఆ సాయం ఆగిపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో కూడా తెలియడం లేదని జై శ్రీనివాస్ భార్య స్వాతి కన్నీటిపర్యంతమైంది. సాయం కోసం ప్రభుత్వం చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తొలివెలుగు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు.. దుఃఖం ఆపుకోలేకపోయింది. వారు పడుతున్న కష్టం.. వారి మాటల్లోనే..
జై శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలనుకునేవారు 94919 84555 నెంబర్ కు గూగుల్ పే చేయొచ్చు