వరుస ప్రమాదాలు.. ఏ మాత్రం దృష్టి పెట్టని పాలకులు…
సంఘటన జరగినప్పుడు హడావుడి…తరవాత షరా మాములే…
ఒకటీ, రెండు కాదు… ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎప్పుడూ ఇంతే..
ఆదుకోవాల్సిన వారు ఆదుకోరు.. శవాలతో రాజకీయాలు చేస్తారు..
ఆరోపణలు తప్ప, ఆచరణ లేదు..
పాపికొండల్లో పెను విషాదం… 62 మందితో గోదావరిలో ప్రయాణిస్తున్న బోటు దేవీపట్నం మండలం కచులూరు దగ్గర మునిగింది. ప్రయాణికులంతా బోటుపైకి ఒకేసారి చేరడమే ప్రమాదానికి ఓ కారణంగా అధికారులు భావిస్తున్నారు.
అసలేం జరిగింది? ప్రమాదం ఇలా జరిగి ఉండొచ్చు..!
వారంతా పర్యటకులు..ఆహ్లద గోదావరి నది అందాలను చూసి ఆనందించాలని బోటులో బయల్దేరారు. పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి రాయల్ వశిష్ట బోటు 72 మందితో పయనమైంది. సంతోషంగా సాగిపోతుందనుకున్న తమ ప్రయాణం విషాదంగా ముగుస్తుందని ఎవరు ఊహించలేదు. దేవిపట్నం మండలం కచులూరు వద్ద ఉదయం 10.30 గంటల సమయంలో అకస్తాత్తుగా బోటు మునకేసింది. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బోటులో పరిమితికి మించి ఎక్కించుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రయాణికులంతా ఒకేసారి బోటుపైకి చేరడమూ..ప్రమాదానికి ఓ కారణంగా అధికారులు తేల్చారు.
రెండు నెలలుగా గోదా వరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం నదీ తీర గ్రామాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ప్రమాదకర సమయంలో పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ బోట్‌ల యాజమాన్యాలు దేవీపట్నం, గోదావరిపై వరదల సమయంలో విహారయాత్రలకు బోట్‌లను తిప్పుతున్నారు. ఈ బోట్‌లు పోశమ్మగండి నుంచి పేరంటాలపల్లి వరకు పాపికొండల విహారానికి ప్రమాదకర పరిస్థితుల నడుమ బోట్లు వెళుతున్నాయి. శనివారం ఒక బోట్‌లో 50మంది పర్యాటకులు నదీ విహారానికి వెళ్లారు.
గత కొన్ని రోజులుగా గోదావరికి వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే గోదావరికి రెండుసార్లు వరద ఉదృతి రావడంతో గోదావరిలో బోటు ప్రయాణాన్ని నిషేదించారు. అయితే, వరద కొద్దిగా తగ్గుముఖం పట్టింది అని తెలియడంతో రాయల్ వశిష్ట అనే పర్యాటక బోటు 72 మందితో గండిపోచమ్మ దేవాలయం నుంచి పాపికొండలు వరకు బోటు బయలుదేరింది. ఇందులో 61 మంది ప్రయాణికులు ఉండగా, 11 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, దేవీపట్నం మండలం కచులూరు మందం వద్దకు చేరుకోవగానే బోటు ఒక్కసారిగా మునిగిపోయింది.
ఇందులోని 14 మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్స్ ఉండటంతో బయటపడ్డారు. మిగతావారి కోసం ఎన్‌డీఆర్ బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వరద ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు బోట్ ప్రయాణాన్ని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు.
1964లో ఉదయభాస్కర్ అనే బోటు అదే ప్రాంతంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తరువాత ఝాన్సీరాణి బోట్ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా అదే ప్రాంతంలో జరగడం శోచనీయం.
వరద ఉధృతి, సుడిగుండాలలో పాపికొండల పర్యాటకం, పట్టించుకోని అధికారులు
పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం..టీడీపీ ప్రభుత్వంలో జరిగితే వైసీపీ వారు ఆందోళన.. వైసీపీ ప్రభుత్వంలో జరిగితే టీడీపీ వారు ఆందోళన.. కానీ ఎవరూ కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదు..ప్రభుత్వం మారుతోంది కానీ, అధికారుల తీరు మారడం లేదు. అసలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు!
– ప్రమాద స్థలం నుంచి ‘తొలివెలుగు’ కోసం సీనియర్ జర్నలిస్ట్ శివ యేచూరి