– బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడంలో దిట్ట?
– లక్ష్మీనారాయణ శర్మ వెనుక ఉన్నదెవరు?
– సీబీఐ కేసులు ఉన్నా చర్యలు నిల్?
– టైటిల్ లేకుండానే నీతమ్ నుంచి భూములు
– టెర్మినల్ డ్రామాతో సుప్రీం దాకా కేసులు
– తాజా వేలం పాటతో తెర పైకి వివాదం
క్రైంబ్యూరో, తొలివెలుగు:ఇండియన్ బిజెనెస్ స్కూల్ లాగా ఎదగాల్సిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్(నీతమ్) అప్పుల్లో కూరుకుపోయింది. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. తాజాగా 2008లో మహా హోటల్స్ కి చేసిన అగ్రిమెంట్ వేలం పాటకు రావడంతో మరోసారి ఇది చర్చనీయాంశం అయింది. అసలు నీతమ్ కి కేటాయించిన 26 ఎకరాలకు టైటిల్ ఉందా? 70 కోట్ల ప్రాజెక్ట్ కి 205 కోట్ల రుణాలు తీసుకున్న లక్ష్మీనారాయణ శర్మ సీబీఐ కేసుల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా 69 కోట్లకు అమ్మేస్తాం అని చెప్పుతున్న బ్యాంకు వారి అసలు గుట్టు ఎంటి? అని తొలివెలుగు క్రైంబ్యూరో ఆరా తీసింది. కార్పొరేట్ కంపెనీల ముసుగులో లక్షల కోట్ల రూపాయల దోపిడీ బయటపడింది.
చరిత్ర ఇదే.. టైటిల్ ఏది?
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో పాటు ప్రారంభం అయిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ ఇప్పుడు ధీన పరిస్థితిలో ఉంది. దీనంతటికి కారకులు ఎవరనేది గతంలో తొలివెలుగు కథనాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ కేటాయించిన 200 కోట్ల అస్తిపై వేలంపాట జరగడంతో తొలివెలుగుకు అసలైన నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే, చరిత్ర ఎంటో ఇప్పుడు ఉన్న వారికి తెలియాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన భూ కేటాయంపుల్లో నీతమ్ కి 26 ఎకరాలు ఇస్తున్నామని పంచనామా మాత్రమే చేశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. ఆ డబ్బులతోనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 10 కోట్లు ఖర్చు చేసింది. అప్పటికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా.. కేటాయించిన భూమికి టైటిల్ ఇవ్వలేదు. అప్పటి టూరిజం సెక్రెటరీ జయేష్ రంజన్ ఇష్టానుసారంగా అగ్రిమెంట్స్ చేయడతో టైటిల్ వివాదంలో చిక్కుకుందని ఆరోపణ. ఇప్పటికీ నీతమ్ ఆ దిశగా ఆలోచించకపోవడంతో మరిన్ని వివాదాలు ఎదురవుతున్నాయి. భూమిని పంచనామా చేసి కేటాయించిన తర్వాత సీసీఎల్ కి లెటర్ రాయాలి. సీసీఎల్ నుంచి బీఎస్ఓ( బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్)కి లెటర్ వెళ్లాలి. అక్కడ భూమి కేటాయిస్తున్నట్లు అప్పటి రిజిస్ట్రేషన్ విలువ లేదా నామినల్ విలువతో ల్యాండ్ కేటాయించాలి. కానీ, ఇదంతా జరగలేదు. ప్రభుత్వ కార్పొరేషన్ లా వ్యవహరించే ఇలాంటి సంస్థలు ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంది. కానీ, భూమి కేటాయింపులు జరగకుండానే నీథమ్ మహా హోటల్స్ కి 26 ఎకరాల్లోని 3 ఎకరాల భూమిని 33 ఏండ్లకు లీజుకిస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఆ అధికారం టైటిల్ లేకుండా ఇవ్వడానికి వీలు లేదు. ఒక వేళ ఇచ్చినా ప్రాజెక్ట్ రిపోర్ట్ తో లోన్ తీసుకున్న తీరు నేరాలకు దారి తీసింది.
70 కోట్లకు 205 కోట్ల లోన్
కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులను ఎలా కొల్లగొడుతున్నాయో చెప్పడానికి ఈ లీజ్ వ్యవహారం ఒక్కటి చాలు. 3 ఎకరాల్లో 4 స్టార్ హోటల్స్ నిర్మించి.. విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో కార్పొరేట్ మోసగాళ్ళు కాచుకుని కూర్చున్నారు. టైటిల్ లేదని తెలిసినా.. డెవలప్మెంట్ అండ్ అగ్రిమెంట్ తో 2010లో 70 కోట్లకు వివిధ దశలో 205 కోట్ల రుణం తీసుకున్నారు. 3 ఏండ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ని చేయకుండానే 3 అంతలు ఎక్కువగా మొదట్లోనే లాగేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నా.. అవన్నీ లాభాలు చేకూరాయి. టూరిజం సెక్రెటరీ రద్దు చేయాల్సిన లీజ్ 5 మందిలో ఉన్న ఒక్క డైరెక్టర్ రద్దు చేయడం వివాదం అయింది. అదే రద్దుపై కోర్టుకు వెళ్లి రచ్చ చేశారు. దీంతో క్రిమినల్ కేసు కాస్తా.. సివిల్ మ్యాటర్ గా మారింది. 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ, ఇప్పటికీ ఆ హోటల్ వారిపై చర్యలు తీసుకోలేదు. అందుకు కారణం కేవలం సివిల్ లిటిగేషన్స్. ఆ సివిల్ మ్యాటర్ లోనే 205 కోట్లు అప్పు ఇచ్చిన బ్యాంకులు కూడా 69 కోట్లు ఇస్తే.. ఇప్పటికిప్పుడు ఉన్న పొజిషన్ ఇచ్చేస్తాం మీరు రండి అంటున్నారు. అదే భూమి విలువ 200 కోట్ల పైనే.
కేంద్రానికి సమాచారం ఉందా?
పీపీపీ ప్రాజెక్ట్స్ లో కేంద్రం వాటా ఉంది. నీతమ్ ప్రాజెక్ట్ కోసం అప్పట్లో 10 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆ డబ్బుతోనే బిల్డింగ్ లు అయ్యాయి. కానీ, ఇప్పుడు జరుగుతున్న తతంగం కేంద్రానికి తెలియకుండా చేయకూడదని రూల్స్ ఉన్నాయి . ఆ పత్యుత్తరాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టైటిల్ ఉందని టూరిజం శాఖ చెప్పుకుంటున్నా.. అది ఆచరణలో లేకపోవడం ఆనాటి కాగ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉండటం దేనికి నిదర్శనమో ఇప్పుడున్న టూరిజం సెక్రెటరీకి, తనకేమీ తెలియదంటూ తెర వెనక అన్నీ నడిపిస్తున్న నీతమ్ డైరెక్టర్ చిన్నంరెడ్డికి స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటూ ఎన్నాళ్లకైనా జైల్లో చిప్పకూడు తినాల్సి ఉంటుంది.
వాసవీనా? ఆర్జీవీఎల్ తోనా?
కుట్రలో భాగంగా ఏ కంపెనీ తమకు అనుకూలంగా ఉంటే వారికి వేలం దక్కేలా ఓ టీం పని చేస్తుంది. మొదట వాసవి గ్రూప్ ట్రై చేసింది. టెక్నికల్ గా ఇవ్వలేమని రిజక్ట్ చేసినట్లు లిక్విడేటర్ తొలివెలుగుకి చెప్పుకొచ్చారు. ఇదే ఒప్పందంతో హోటల్స్ లో అనుభవం ఉన్న కంపెనీతో ఆ టీం చర్చలు జరిపింది. మరో 33 ఏండ్లు రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గతంలో ఓ కంపెనీకి ఓల్డ్ గాంధీ హాస్పిటల్ వ్యవహారం గుర్తు చేసి చెప్పారు. దాంతో ఒప్పందం కుదుర్చుకొని ముందుకు నడిచేలా సచివాలయంలోని కీలక వ్యాక్తి, ఆయన సోదరుడైనా నీతమ్ డైరెక్టర్ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
బ్యాంకర్స్ కి మొదలైన గుబులు
70 కోట్ల ప్రాజెక్ట్ కి 205 కోట్ల రుణం ఇచ్చినప్పుడు లేని టెన్షన్.. ఎన్సీఎల్టీ ఉత్తర్వులతో వేలం వేస్తున్నప్పుడు వస్తోంది. సీబీఐకి కూడా ఫిర్యాదు అందడంతో దర్యాప్తు కొనసాగుతోంది. తీసుకున్న డబ్బులు వివిధ కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు అధికారులు. ఆ దిశగా రికవరీ నడుస్తోంది. కానీ, 205 కోట్లకు పదేళ్లయినా ఉన్నది ఉన్నట్లు అమ్ముతున్నామనే డ్రామాతో 69 కోట్లు వచ్చినా చాలు అంటూ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తదుపరి రికవరీ, అభియోగాలు వచ్చేవారికి సంబంధం లేదంటూ లిక్విడేటర్ తొలివెలుగు క్రైంబ్యూరోకి తెలిపారు. కానీ, టైటిల్ లేని భూమిపై స్పష్టత లేదు. తాము ఎన్సీఎల్టీ ఆర్డర్స్ కి అనుకూలంగానే వెళ్తున్నామని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు వ్యవహారం గతంలో ఎన్నో సీబీఐ కేసుల్లో తేటతెల్లం అయింది. ఇప్పుడు ఈ వ్యవహారం అధికారుల తీరు ఏంటో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. 205 కోట్ల రుణం ఇచ్చిన అధికారులపై చర్యలు ఏంటో.. ఇప్పుడు 70 కోట్లకు వేలం పాడాలనుకుంటున్న వారి తీరు ఏందో తేలాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది?
అప్పుడు కేటాయింపుల అక్రమాలపై కాగ్ కుండ బద్దలు కొట్టింది. టూరిజం సెక్రెటరీ చేయాల్సిన లీజ్ రద్దును.. అక్రమంగా డైరెక్టర్ చిన్నంరెడ్డి చేసి కోర్టు వరకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీం వరకు వెళ్లారు. చిన్న చిన్న ప్లాట్స్ ని ఆదాయం కోసం అంటూ అమ్మకానికి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత విలువైన 3 ఎకరాల భూమిని ఎందుకు హెచ్ఎండీఏ దృష్టిలో పెట్టుకోలేదు. అసైన్డ్ భూములను సైతం అమ్మేస్తున్న సర్కార్. టైటిల్ ఇవ్వలేనందున ప్రైవేట్ పార్టీకి అమ్ముకోవడం లేదు. 200 కోట్లు ఇట్లే వచ్చే టెండర్ కి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. బ్యాంకుల లోన్ పేర్లతో కొంతమందికి ఎలా లబ్ది చేకూర్చాలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం పసి గట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉంది.