– గ్రీన్ బిల్డ్ డెవలపర్స్ వర్సెస్ కేబీఆర్ సొసైటీ
– తెర వెనుక పెద్దల హస్తం
– నాలా కన్వర్షన్, మ్యూటేషన్ అంటూ వివాదం
– లిటిగేషన్ సృష్టిస్తున్న రెవెన్యూ రికార్డులు
– సరిహద్దుల సమ్యలతో సతమతం
– తగ్గేదే లేదంటూ నిత్యం తగాదాలు
– ఒత్తిళ్లతో చేతులెత్తేస్తున్న వైనం
– కాకరేపుతున్న కోకాపేట భూములపై తొలివెలుగు ఎక్స్ క్లూజివ్
క్రైంబ్యూరో, తొలివెలుగు:కోకాపేట్ అంటేనే వేల కోట్ల రూపాయల బిజినెస్. సెంట్ భూమి ఉంటే కోటీశ్వరుడు. అలాంటి ఏరియాలో వివాదం ఉంటే.. రాజకీయ నాయకులకు పండగే. రోజురోజుకీ ప్రైం ప్రాపర్టీ అవుతుండటంతో వివాదం ముదురుతోంది. ఎవరూ తగ్గేదే లేదంటూ రోడ్లమీద పడి కొట్టుకుంటున్నారు. ఇష్యూతో విసిగిపోయిన పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. ఎక్కడో భూపాలపల్లిలో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ మంత్రి కోర్టు తీర్పు ఉంది చూసుకుందామని హామీలు ఇవ్వడంతో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా కోకాపేటలో రియల్ కోట్లాట షురూ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని ఒత్తిళ్లు ఉన్న భూమిపై తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్ చేసింది. వివాదాలను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. మాజీ పోలీస్ ఆఫీసర్ వద్ద ఏమున్నాయి? ఎన్ని ఫిర్యాదులు పోలీస్ స్టేషన్స్ కు వచ్చాయో ఆరా తీయగా.. రోడ్డున పడ్డ ప్రైవేట్ ప్రాపర్టీ వివాదంపై కీలక విషయాలు తెలిశాయి.
క్రయవిక్రయాలు ఇలా!
కోకాపేటకు చెందిన ముక్కల వీరయ్యకు సర్వే నెంబర్ 154, 155, 156లలో 21 ఎకరాల 26 గుంటలు ఉండేది. ఈయనే ఒరిజినల్ పట్టాదారుడు. వీరయ్య 1964లో 9.26 ఎకరాల భూమిని కరణ్ సింగ్ మామోలీ బాయ్ కి అమ్మకం జరిపారు. ఇది ఎక్స్ ట్రీం వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఇదే భూమిని 1967లో బీ రాధాకృష్ణ, కాకర్ల కమలాదేవి, వీ రమాదేవి తీసుకున్నారు. రాధాకృష్ణ 30 గుంటలను 6 ప్లాట్స్ గా చేసి 1969లో విక్రయించారు. మరో 7.12 ఎకరాల భూమిని కేబీఆర్ కుటుంబానికి 1998లో అమ్మేశారు. 2016లో మరో 2.14 ఎకరాల భూమిని తన కుమారులైన మధుసుదనరావు, అజయ్ కుమార్ ల పేర్ల మీదకి మార్పిడి చేశారు. 2016లోనే వీరిద్దరూ ఆ భూమిని వెంకటేశ్వరరెడ్డికి అమ్మేశారు. రాధాకృష్ణకు భూమి మొత్తం 8.13 ఎకరాలు ఉంటే.. అమ్మకం జరిపింది మాత్రం 10.13 ఎకరాల భూమి. అంటే సర్వే నెంబర్ 154లో తనకు భూమి లేకుండానే 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. 2003 నుంచి క్లయిమ్ చేసుకున్నారు. తూర్పు దిక్కున ఉండే మరో 4.25 ఎకరాల భూమిని 1968లో ఎంఏ ఖయీం కొనుగోలు చేశారు. ఇతని వద్ద నుంచి 1979లో మల్లికార్జున్ రావు తీసుకున్నారు. 2004లో ఈ భూమిని టీ అజయ్ రెడ్డితో పాటు కొంతమంది కోనుగోలు చేసి లుంబినీ విల్లాస్ నిర్మించారు. తూర్పు, పడమర మధ్యలో ఉన్న భూమిని వీరయ్య లీగల్ హెయిర్స్ ఐదుగురు 7.15 ఎకరాలను జీ రాజేంద్రకు 4, మాధవీలతకు 2.29 ఎకరాలు అమ్మారు. రాజేంద్ర 2005లో కోమటిరెడ్డి అనిల్ రెడ్డి సహా ఇతరులకు విక్రయించారు. మాధవీలత టీ గిరిధర్ రెడ్డికి, పద్మజకు అమ్మేశారు.
ధరణి వల్లే మొదలైన వివాదం
రాధాకృష్ణకు అమ్మిన భూమి 1982లో మ్యూటేషన్ జరిగింది. ఈయనకు విక్రయించిన భూమిని తమకు ముందే అమ్మేశారని అగ్రిమెంట్ సెల్ ఆన్ రిజిస్ట్రార్ పేపర్ తో జగదీశ్వర్ అప్పా, ఈశ్వర్ లాల్, శివాజీ లు 1993లో ఆర్డీవో వద్ద అప్పీల్ చేశారు. జగదీశ్వర్ పట్వారీ కావడంతో ప్రోసీడింగ్స్ అన్నీ ఇచ్చుకుని రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కారు. దీనిపై ఆర్డీవో జగదీశ్వర్, ఇతరులు వేసిన పిటిషన్ ని రద్దు చేశారు. దీనిపై 1997-98లో జాయింట్ కలెక్టర్ వద్దకి వెళ్లింది. అక్కడ తిరస్కరించారు. 2002లో జేసీ ఆర్డర్ పై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో జేసీ ఆర్డర్స్ ని రద్దు చేస్తూ.. మళ్లీ కొత్తగా విచారణ జరపాలని ఆదేశాలు వచ్చాయి. ఈ స్టేటస్ కో మెయింటెన్ చేయాలని తీర్పు ఇచ్చింది హైకోర్టు. అయితే, 1998లోనే వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసుకుని వాణిజ్య భూమిగా మార్చుకుంది కృష్ణవేణి భీంరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ(కేబీఆర్). మరోసారి 2015లో జాయింట్ కలెక్టర్ వద్ద వీరయ్య వారసులు అమ్మకం జరిపారని చెప్పుకుంటున్న వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి అంతా రెవెన్యూ కోర్టులో ఉందని ప్రోహిబిటెడ్ లిస్ట్ లో మెయింటెన్ చేశారు. కానీ, రెవెన్యూ రికార్డుల్లో అప్పటి పేర్లే వచ్చాయి. ధరణిలో కూడా ఉండటంతో శివాజీ లీగల్ హెయిర్స్ గ్రీన్ బిల్డ్ డెవలపర్స్ కి అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ తో రంగారెడ్డి కోర్టులో సూట్(180 ఆఫ్ 2022) ఫైల్ చేశారు. శివాజీ వారసులు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఎక్స్ పార్టీ తీర్పునిచ్చింది కోర్టు. ఇద్దరూ రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ లో 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్న తీర్పును పొందారు. అయితే, 45 రోజుల్లో డీడ్ ఎగ్జిక్యూటివ్ కాలేదు. ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని అధికారులు చేయలేదు. దీంతో మళ్లీ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో శివాజీ కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. దీంతో ఎక్స్ పార్టీ తీర్పు తో ధరణిలో కొత్త నిబందన ప్రకారం కోర్టు తరుఫున వచ్చిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వవచ్చు. వీటన్నింటిని పట్టించుకోకుండా సివిల్ కోర్టు తీర్పుతో 5 ఎకరాల 14 గుంటలు రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిపై రిపోర్టు రాసి కోర్టుకు సమర్పించారు. దీంతో పొజిషన్ కోసం కేబీఆర్ సొసైటీకి చెందిన మాజీ డీఐజీ గోపినాథ్ రెడ్డి సోదరులు గజమోహన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డితో పాటు లావణ్య ఫైట్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, రాయలసీమకు చెందిన గ్రీన్ బిల్డ్ డెవలఫర్స్ బీంరెడ్డిగారి మోహన్ రెడ్డి, హన్మంత్ రెడ్డి తమకు టైటిల్ ఉందని అంటున్నారు. అసలు టైటిల్ దారులపై గతంలో సివిల్ కోర్టులో తీర్పులు ఉన్నాయి. ఎక్స్ పార్టీ తీర్పులతో ధరణి వ్యవహారంతో ఇప్పుడు వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రోడ్డుపై కొట్లాటల దాకా వెళ్లింది.
పొలిటికల్ కలరింగ్!
ఈఐపీఎల్ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ భూమికి ఎదురుగానే ఉంటుంది. ఈ బిల్డర్స్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువు. ఈయన మహబూబ్ నగర్ మంత్రితో చెప్పించి పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని కేబీఆర్ సొసైటీ ఆరోపిస్తోంది. గ్రీన్ బిల్డ్ డెవలపర్స్ తో తమకెలాంటి సంబంధం లేదని ఈఐపీఏల్ ఓనర్ శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతా ఆయన ఆఫీస్ నుంచే నడుస్తుందని.. అర్ధరాత్రి గొడవ కూడా అక్కడి నుంచే స్కెచ్ వేశారని అంటున్నారు. మొత్తానికి ప్రశాంతంగా ఉండే కోకాపేట సెజ్ లో కాక పుట్టించేలా రియల్ కొట్లట జరగడం వివాదాస్పదమవుతోంది.