పాత సినిమాల సంగతులు ఈ తరానికి అంత ఆసక్తిగా ఉండవు. కానీ, విడ్డూరంగా అనిపిస్తాయి. ఆనాటి మూవీల పేపర్ పబ్లిసిటీ, రిలీజ్ తేదీలు, థియేటర్ల సమాచారం వింతగా అనిపిస్తుంది. పాత ధియేటర్లు ప్రస్తుతం ఉండకపోవచ్చు. కానీ వాటి జ్ఞాపకాలు ఉంటాయి.
తెలుగుతెర సంచలన నటులు ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన భలే తమ్ముడు 50 ఏళ్ళ క్రితం 1969 సెప్టెంబర్ 18న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కు 11 రోజుల ముందుగా 1969 సెప్టెంబర్ 7న ఆంధ్ర పత్రికలో ప్రకటన వచ్చింది.
రిలీజ్ రోజు కూడా ప్రకటన వచ్చింది. అవి ఇప్పుడు చూస్తే వెరైటీగా అనిపిస్తాయి. హైదరాబాద్ కాచిగూడ బసంత్, సికింద్రాబాద్ చిత్రాణీ ధియేటర్లలో రిలీజ్ అయింది.
ప్రస్తుతం ఆ రెండు థియేటర్లు మూత పడ్డాయి. బసంత్ టాకీస్ ఇప్పుడు అపార్ట్మెంట్ అయింది. చిత్రాణి ఇప్పుడు దీపక్ ట్రాన్స్‌పోర్ట్ అయింది.
భలే తమ్ముడు మూవీలో ఎన్టీఆర్, కె.ఆర్.విజయ జోడీ అలరించింది. నేరో ఫాంట్, టైట్ షర్ట్స్ అప్పటి ఫ్యాషన్. అవే ఇప్పుడు రిపీట్. షమీకపూర్ డ్యూయల్ రోల్ తో 1962లో హిందీలో నిర్మాత శక్తిసామంత నిర్మించిన ‘చైనాటౌన్’ ఆధారంగా భలే తమ్ముడు సినిమా రూపొందించారు. ‘చైనాటౌన్’ చిత్రం 1962 అక్టోబర్ 5న విడుదలై విజయం సాధించింది. దీని ఆధారంగా తమిళంలో ఎంజి రామచంద్రన్, జయలలిత జంటగా ‘కుడి ఇరందకోయిల్’ మూవీగా కె. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘కుడి ఇరందకోయిల్’ చిత్రం తమిళనాట 1968 మార్చి 15న విడుదలై ఘన విజయం సాధించింది. తారక రామా పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగులో ఇదే కథతో రూపొందిన భలేతమ్ముడుగా చిత్రం 1969 సెప్టెంబర్ 18న విడుదలైంది. నిర్మాత ఎ పుండరీకాక్షయ్య, దర్శకత్వం బిఏ సుబ్బారావు. ‘చైనాటౌన్’ చిత్రంలో పాటలు పాడిన మహమ్మద్ రఫీతోనే తెలుగులోనూ నిర్మాత పాడించారు. భలేతమ్ముడు వసూళ్ల పరంగా, ప్రేక్షకాదరణ పరంగా విజయం సాధించింది. రిపీట్ రన్స్‌లోనూ బాగా ప్రదర్శింపబడింది. భలే తమ్ముడు మూవీని స్ఫూర్తిగా తీసుకుని హిందీ డాన్ తీశారంటారు. ఇవీ ఆనాటి సంగతులు.