– నాటి పాలకుల ముందుచూపుకు తూట్లు
-నగరానికి ఊపిరిపోసే చోటుకి.. ఉరి వేస్తారా!
-111 జీవో రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
– ఎత్తివేయడం కేసీఆర్ వల్ల అవుతుందా?
– కమిటీ పేరుతో కాలయాపన..ఇప్పుడు సాధ్యమేనా?
– సుప్రీం తీర్పుని వెకేట్ చేయించే సత్తా ఉందా?
– ఉత్తుత్తి హామీలతో ఇంకా ఎన్నాళ్లీ మాయ?
– రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా..
– సామాన్యుడికి శాపంగా ప్రకటనలు!
– జీవో రద్దు సాధ్యాసాధ్యాలపై..
– తొలివెలుగు క్రైంబ్యూరో ప్రత్యేక కథనం
111 జీవో పేరు ఎప్పుడు తెరపైకి వచ్చినా తెలంగాణ రాజకీయాలు యమ ఇంట్రస్టింగ్ గా మారిపోతాయి. జంట జలాశయాల వాడకం విషయంలోగానీ.. కేటీఆర్ ఫాంహౌస్ అంశం గానీ..రియల్ ఎస్టేట్ వ్యాపారం గానీ..ఇలా వాటి చుట్టూ అల్లుకున్న111 జీవో గురించి ఎప్పుడు మాట్లాడినా మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంటుంది.తాజాగా అసెంబ్లీలో ఈ జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.దీంతో అసలు.. ఈ 111 జీవో ఏంటి? ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? అది సాధ్యమేనా? ఇలా అనేక ప్రశ్నల చుట్టూ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
111 జీవో ఏంటి..ఎందుకు..?
1996 నాటికి హైదరాబాద్ అభివృద్దిని అంచనా వేసి తాగునీటి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో..జంట జలాశయాలను కాపాడటానికి 111 జీవోను తీసుకొచ్చారు. నిజానికి మరో భాగ్యనగరం నిర్మించగలిగేంత విస్తీర్ణంలో అంటే దాదాపు లక్షా 32 వేల ఎకరాల్లో ఈ జీవో పరిధిలోని భూములున్నాయి. ఇవన్నీ 84 గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. 1908లో మోక్షగుండం విశ్వేశరయ్య హైదరాబాద్ కు వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ను నిర్మించారు. కేవలం పైపులతోనే 4 వందల ఏళ్ల చరిత్ర ఉన్ననగరానికి మంచి నీళ్లు అందించేలా ప్లాన్ చేశారు.అయితే తాగునీరు పొల్యుషన్ కాకుండా ఉండటంతో పాటు..పశ్చిమ కనుమల నుంచి వచ్చే గాలి శీతోష్ణస్థితిని మార్చేస్తుందని అన్ని నగరాల కంటే ఇక్కడ భిన్నమైన వాతావారణం ఉంటుందని.. ఈ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు,ఫ్యాక్టరీలు పెట్టినా పర్యావరణ హితం కాదనే సదుద్దేశంతో 111 జీవోకి ప్రాణం పోశారు.ఇప్పుడు అది ఎత్తివేస్తే ఈ 26 ఏళ్ల అభివృద్ధికి ఈ ప్రాంతం తట్టుకోవడం కష్టం.111 ఎత్తివేస్తే.. హైదరాబాద్ కి ఊపిరితిత్తుల్లాంటి జలాశయాలకు ఉరి పోసినట్లే. 111 ప్రకారం.. 84 గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి భవంతులు నిర్మించరాదు.లే అవుట్స్ ఏర్పాటు చేయకూడదు.చెక్ డ్యాములు, లిప్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకుండా స్థానిక సంస్‌్ల ఆథారిటీకి ఆ బాధ్యత ఇచ్చారు.ఉస్మాన్ సాగర్ నుంచి ఆసీఫ్ నగర్ వరకు ఉన్న నాలాకు 100 ఫీట్ల వరకు నిర్మాణాలు చేపట్టరాదని జీవోలో స్పష్టంగా ఉన్నాఅతిక్రమిస్తూనే ఉన్నారు.అందుకు రాజకీయ నేతలే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. జీవో 111ను అతిక్రమించిన అక్రమ నిర్మాణాల్లో ఎందరో ప్రముఖులవి కూడా ఉండటంతో ఆ జీవోను ఎత్తివేయిస్తామని కొందరు నేతలు హామీలిస్తూ వస్తున్నారు.
ఏడేళ్లుగా ఎందుకు సాధ్యం కాలేదు?
నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందే ఎన్నికల ప్రచారంలో 111 జీవోని వాడేశారు.అధికారంలోకి వచ్చాక 2016లో ఐఏఎస్ లు ఎస్పీ సింగ్ ,ఎస్కే జోషి, దాన కిషోర్ లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.రెండేళ్లలో తేల్చాలని ఎన్జీటీ ఆర్డర్ ఇస్తే..నాలుగేళ్లు అయినా ఏం చేయలేదు. దీంతో ఎన్జీటీ 6 నెలల పాటు స్టేటస్ కో మెయింటెన్ చేయాలని ఆదేశించింది.ఆ తర్వాత హైకోర్టులో 2 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి.వీటిపై ఆ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. 2018 మార్చి 11న ఎన్నికల సందర్భంగా 111 జీవోను ఎత్తేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే.. 1999లోనే పరిశ్రమ ఏర్పాటుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తే.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అప్పుడే ప్రికాషనరీ ప్రిన్సిపుల్ కింద డివిజన్ బెంచ్ చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది.111 జీవోని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తనకు అనుకూలమైన వారికి మేలు చేసేలా చేయరాదని తెలిపింది. దీంతో అప్పటి నుంచి ఎవరూ దీని జోలికి వెళ్లలేదు. ఆ ప్రయత్నం చేసినా.. 111 జీవో పరిధిని కుదించేలా చేయాలని మాత్రమే అధికారులు సూచనలు చేశారు. కానీ.. కేసీఆర్ ఏకంగా జీవోను ఎత్తేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం వెనుక కేవలం ఓట్ల రాజకీయమే కనిపిస్తోందనే వాదన తెరపైకి వస్తోంది.
రద్దు చేయాలంటే ఏం చేయాలి?
జీవో 111ని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టు ప్రిన్సిపుల్ ప్రకారం లేదు. ఒక్కసారి ప్రికాషనరీ ప్రిన్సిపుల్ అంటూ మెన్షన్ చేస్తే.. ఆ తీర్పు మళ్లీ సుప్రీం కోర్టే తేల్చాలి. అదీకాకుండా పర్యావరణ మార్పులు, వరద ప్రవాహం, తాగు నీటి సమస్యల వంటి అంశాలను కూడా అంచనా వేయాలి.కేవలం తాగునీటి ఎద్దటి తీరిందని రద్దు చేసే అవకాశాలు లేవు.అలా చేస్తే..కోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తుంది.పరిధిని తగ్గించాలని చూసినా..ప్రజల అభిప్రాయాలతో పాటు ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నారో కోర్టు ముందుంచాలి.ఇదంతా కావాలంటే..కనీసం 5 నుంచి ఏడేళ్లు పట్టే అవకాశాలు ఉంటాయి.
నమ్మితే నట్టేట మునిగినట్టే!
ముఖ్యమంత్రి ఏ ముచ్చట చెప్పినా కార్యాచరణ దాల్చడమంటే అంత ఈజీ కాదు. దేశ ప్రధాని అవుతానని.. ఎలా అయితే తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారో.. 111 జీవోని ఎత్తివేస్తానని చెప్పడం కూడా అలాంటిదే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 111 జీవో ఏరియాలోని 84 గ్రామాల్లో గ్రామకంఠం తప్ప.. మరెక్కడా అక్రమ నిర్మాణాలు చేపట్టరాదు. దీనిపై 2000 సంవత్సరంలోనే సుప్రీం సివిల్ అప్పీల్ పిటిషన్ పై స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించిన వారిపై 2,500 కేసులు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో విచారణ కొనసాగుతున్నాయి. వీటన్నింటిపై ఏరోజూ కోర్టుకు సమాధానం చెప్‌గలేదు. కానీ.. ఇప్పుడు ఎత్తివేస్తామంటే కోర్టుల్లో కనీసం 5 ఏళ్ల విచారణ జరగాల్సి ఉంటుంది. కూల్చివేయాలని అదేశిస్తే.. ఎప్పటికీ బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగించడమే అవుతుందని న్యాయనిఫుణులు అంటున్నారు.
Advertisements
అక్రమాల లిస్టు ఇదే..!
తొలివెలుగు క్రైం బ్యూరో చేతిలో 111 జీవో పరిధిలోని అక్రమ నిర్మాణాల లిస్ట్ ఉంది. గతంలో పంచాయితీ రాజ్ సర్వే చేయించి నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా భారీగా నిర్మాణాలు జరిగాయి. 2021 డిసెంబర్ వరకు 508 అక్రమ లేఅవుట్స్ ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నింటిని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేశారు. కొన్నిచోట్ల వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. వాటిలో 7,150 వరకు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అలాగే 6,225 వరకు గ్రామకంఠం పేరుతో గృహాలు నిర్మించుకున్నారు. ఇక్కడ 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మరో 5,202 గృహాలు, ఇతర నిర్మాణాలు అన్ని కలిపి సుమారు 15 వేల వరకు చేరుకున్నాయి. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా గోడలు సైతం నిర్మించారు.సినీ, రాజకీయ నాయకులు ఫాంహౌస్ కట్టుకున్నారు.వాటిలో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ కి చెందినది కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి.