ఈ సృష్టికి మూలం స్త్రీ.. స్త్రీ జన్మ సార్థకం అమ్మతనం. ఆ అమ్మతనం కలగని వారు సంతానం కావాలంటే ఈ జగన్మాతను దర్శించుకుని అమ్మవారి దగ్గర తేనే ఉంచి తమ కోరికలను కోరుకొని ఆ తేనెను నాలుకతో సేవిస్తే గర్భం దాల్చే అవకాశం ఉందని నానుడి.. ఆ జగన్మాత ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం…తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5వ శక్తి పీఠం శ్రీశైల పశ్చిమ ద్వారంగా పిలువబడే అలంపూర్ పుణ్య క్షేత్రంలో ఉంది…
సంతాన ప్రదాయనిగా పూజలందుకుంటున్న ఎల్లమ్మ :
పూర్వం అలంపూర్ ప్రాంతంలో జమదగ్ని ఆశ్రమం ఉండేది. ఆయన భార్య రేణుకా దేవి ప్రతిరోజు నదికి వెళ్లి ఇసుకతో కుండను తయారు చేసుకుని వాటితో నీరు తీసుకొని వచ్చేది. ఒకరోజు మహారాజు వెయ్యి మంది భార్యలతో అక్కడికి వచ్చి జలక్రీడలు ఆడుతుండగా చూసిన రేణుక తన మనసులో రాజు వైభవాన్ని, అతని భార్యల గురించి అనుకోవడం వలన మనోవికారం కలుగుతుంది. అందువల్ల ఆ రోజు ఇసుక కుండ తయారు కాదు. దాంతో రేణుక ఆలస్యం చేసి నీరు తీసుకురానందువల్ల జమదగ్ని కోపగించి ఆమెను చంపమని కొడుకులను ఆజ్ఞాపిస్తాడు.తల్లిని చంపడానికి పెద్ద కుమారులు ఎవరూ ముందుకు రారు. కానీ పరుశురాముడు మాత్రం తల్లి తలను నరికి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడు. అప్పుడు జమదగ్ని సంతృప్తి చెంది ఏం వరం కావాల ని అడుగగా పరుశురాముడు తల్లిని బ్రతికించమని ప్రార్థిస్తాడు. రేణుక తల చాండల వాటికలో పడడం వల్ల బ్రతికించడం కష్టమని, ఈ తల ఎల్లమ్మ పేరు తో గ్రామదేవతలా పూజలు అందుకుంటుందని జమదగ్ని చెప్పడం జరిగింది. ఉండవెల్లి(మండలం) గ్రామంలో గుడి కట్టించి గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పూజించు కోవడం జరుగుతోంది. ఆమె శరీరం బ్రహ్మేశ్వర ఆలయంలో సంతానం లేని స్త్రీలతో పూజలందుకుని సంతానం ఇచ్చే దేవతగా ఉంటుందని జమదగ్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ భూదేవి పేరుతో స్త్రీలతో పూజలందుకుంటుంది. సంతాన ప్రదాయిని అయిన అమ్మవారు ఇక్కడ మహిళా భక్తులకు నగ్నంగా దర్శనమిస్తోంది. అమ్మవారి దగ్గర నవనీతాన్ని ఉంచి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణా భక్తిగా ఆరాధించి ఆ వెన్నను తీసుకుంటారో వారికి అమ్మవారు అనుగ్రహించి సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నది భక్తుల నమ్మకం.అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం, మంగళవారం మాత్రమే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.శుక్ర, మంగళవారాల్లో నలుమూలల నుంచి వచ్చే మహిళా భక్తులతో భూదేవి ఆలయం కిటకిట లాడుతోంది.