ప్రమాదం జరిగిన ప్రదేశం చాలా డేంజరస్. ఈ ప్రాంతంలో నది ప్రమాదకరంగా వుంటుంది. సుడిగుండాాలు వుంటాయని స్థానికులు చెబుతారు. లాంచిలో వున్న టూరిస్టు గైడు కూడా అదే చెబుతుండగా ఇంతలో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు కథనం.
రాజమహేంద్రి: ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు అంత సులువు కాదని అధికారులు, రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్న బలగాలు చెబుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బోటు గోదావరి నదిలో 300 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతం ప్రమాదకరమైనదిగా స్థానికులు చెప్తుంటారు. సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కష్టాలు పడుతున్నారు.
కచ్చులూరు వెళ్లడానికే సరైన మార్గం లేదు. నదీ మార్గాన వెళ్లాలన్న దేవీపట్నం నుంచి గంటన్నర ప్రయాణించాలి. మొన్నటి దాకా ఈ ప్రాంతమంతా వరద బారిన పడి బురదతో నిండిపోయింది. దీనికి తోడు ఇప్పుడీ ప్రమాదం ముంచుకురావటంతో సహాయక చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వాడపల్లి వద్ద లాంచీ ప్రమాదం జరిగినప్పుడు రెండు వైపుల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తేనే చాలా సమయం పట్టింది. ఇప్పుడు గోదావరిలో లోతైన ప్రదేశంలో సహాయక చర్యలు అంత సులభం కాదని నిపుణులు వివరిస్తున్నారు. ‘ఇది అత్యంత ప్రమాదకర ప్రాంతం. ఇక్కడ సుడిగుండాలుంటాయి.’ అని బోట్ అక్కడికి చేరుకున్న సమయంలో టూరిస్ట్ గైడ్ ఒకరు మైక్‌లో పర్యటకులకు వివరించారు. అదే సమయంలో బటు ప్రమాదం జరిగిందని కొందరు చెప్పారు.
బోటు యజమానుల స్వార్ధం వల్లే ప్రమాదాలు
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రెండు నెలలుగా గోదావరికి వరద నీరు వచ్చి చేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద తీవ్రత కారణంగా నదీ తీర గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రమాదకర పరిస్థితులు ఉన్న సమయంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నడిచే బోట్లు నిలిపివేయాలి. కానీ, స్వార్థపరులైన ప్రైవేటు బోటు యాజమానులు యథేచ్ఛగా బోట్లు నడుపుతూనే ఉంటారు. అధికారులకు ఇది తెలిసినా వాళ్లు అససలు పట్టించుకోరు. వాళ్ల నెలవారీ మామూళ్లు వాళ్లకు వెళ్తూనే వుంటాయి. దేవీపట్నం దగ్గర గోదావరిపై ఇలా అనేక బోట్లు తిప్పుతూ వాటి యజమానులు సొమ్ము చేసుకుంటుంటారు. ప్రమాదమని తెలిసినా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎంతో మంది కుటుంబాలకు తీరని వేదన మిగుల్చుతున్నారు. అసలు ఇక్కడ తిరగాల్సిన పర్యాటక సంస్థ బోట్లు ఎప్పుడూ ఏదో ఒక రిపేర్ పేరుతో సర్వీసుల్ని నిలిపివేస్తుంటారు. టూరిస్టు బోట్లు వుండగా, ప్రైవేట్ బోట్లు ఎందుకు నడుపుతున్నారో పర్యాటక మంత్రి సమాధానం చెప్పాలి. దుర్ఘటన జరిగినపుడు మాత్రం హడావుడి చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించకపోవడం వల్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఫలితంగా ఎందరో అమాయకుల ప్రాణాలు గోదావరిలో కలిసిపోతున్నాయి.