మాటిచ్చి మరచిపోతే జనం ఊరుకుంటారనుకోవడం నేతల తెలివితక్కువతనం. కొండగట్టు ప్రమాదం జరిగి ఏడాది పూర్తయ్యింది. అప్పుడు ఎన్నికల కోడ్ వంక పెట్టి కేసీఆర్ కనీసం బాధిత కుటుంబాల పరామర్శకు కూడా వెళ్లలేదు. ఇస్తానన్న పరిహారం కూడా ఏడాది పూర్తయినా ఇంతవరకు ఇవ్వనే లేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టారని అనుకోడానికి ఇది పిల్లలాట కాదు. నిజానికి కొండగట్టు ప్రమాదం రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రమాదం. ఇందులో అడుగడుగునా టీఎస్ఆర్టీసీ నిర్లక్ష్యం వుంది. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ముమ్మాటికీ ప్రభుత్వంలోని పెద్దలే. ఆ పెద్దమనుషులు మరచిపోతే జనం కూడా మరచిపోతారా..? ప్రతి ఒక్కటీ గుర్తుపెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారు. ఇప్పుడు సమయం వచ్చింది.
కరీంనగర్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేట పర్యటనకు వచ్చిన మంత్రుల్ని కొండగట్టు ప్రమాద బాధితులు వదిలి పెట్టలేదు. కొండగట్టు ప్రమాదంలో పరిహారం ఇస్తామని మాట ఇచ్చి మరీ గట్టు మీద పెట్టినందుకు గట్టిగానే బుద్దిచెప్పారు. హిమ్మత్‌రావుపేట గ్రామ సభ కోసం వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లను అక్కడ నిలబెట్టేశారు. కొండగట్టు బాధితుల ఆందోళనకు మంత్రులిద్దరూ అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది.
కొండగట్టు ప్రమాదం జరిగి ఏడాదైనా మృతుల కుటుంబాలకు ఇప్పటిదాకా పరిహారం అందలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో మంత్రులిద్దరినీ తిట్టిపోశారు. గ్రామ సభకు వెళ్తున్న మంత్రుల్ని ఘెరావ్ చేశారు. కాన్వాయ్‌కు అడ్డంగా బైఠాయించారు. పరిహారం తేల్చే దాకా కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని నిలదీశారు. మంత్రులు సహజ ధోరణిలో పరిశీలిస్తామని చెప్పినప్పటికీ గ్రామస్తులు కచ్చితమైన హామీ ఇస్తేనే ఇక డ నుంచి కదులుతామని తేల్చి చెప్పారు. దాంతో మంత్రులు వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వదిలిపెట్టారు.
ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. ప్రజలు నిలదీసిన వైనాన్ని మంత్రులిద్దరూ అంత తేలిగ్గా తీసుకోలేదు. హైదరాబాద్ వెళ్లగానే కక్షతీర్చుకునేందుకు ప్రయత్నించారని స్థానికులు మండిపడుతున్నారు. మంత్రుల కాన్వాయ్‌కు అడ్డుపడి రోడ్డుపై బైఠాయించిన వారిపై పోలీసులు తరువాత కేసులు బుక్ చేశారు. మొత్తం 8 మందిపై కేసులు పెట్టారు. గ్రామస్తులు దీన్ని తప్పు పట్టారు. పరిహారం అడిగితే కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ అంతటా సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అయ్యింది. మంత్రుల ప్రవర్తనని అందరూ తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. కొండగట్టు మేటర్ అలా వుంటే, ఇప్పుడు ఏపీలో జరిగిన గోదావరి ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, ఒక్కొక్క కుటుంబానికి ఐదేసి లక్షలు నష్ట పరిహారం ప్రకటించడం చూసి జనం ఇది ఇచ్చే వ్యవహారమేనా అని మాట్లాడుకుంటున్నారు.