అత్తాకోడళ్ల జగడాలు సర్వ సాధారణమే. టెలివిజన్ సీరియళ్లకి అత్తాకోడళ్ల కథలే ఎప్పటికీ టీఆర్‌పీలు. అత్త అంటే గయ్యాళి.. కోడలంటే గడుసుది.. అనే మాట ఫిక్సయిపోయంది. కానీ, రియల్ లైఫులో అలా వుండట్లేదు. అత్తా కోడలు తల్లీ కూతుళ్లా వుంటున్నారు.
ఒడిశా రాష్ట్రం అనుగుల్ ఏరియా గోబరా గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ప్రతిమ బెహరా అమ్మను మరిపించిన అత్తగా ప్రశంసనీయమైన పాత్ర పోషించింది.! వితంతువైన కోడలికి తానే వరుడిని చూసి అమ్మగా మారి పునర్ వివాహం చేసి అరుదైన అత్తమ్మగా మారింది.
2019 ఫిబ్రవరిలో ప్రతిమ బెహరా కుమారుడు రష్మీ రంజన్‌కు సమీప తురాంగ గ్రామానికి చెందిన లిల్లీతో వివాహం చేయించింది. అయితే విధి వక్రీకరించి పెళ్లైన ఐదు నెలల తర్వాత కుమారుడు గని ప్రమాదంలో చనిపోయాడు. దీంతో లిల్లీ బెహరా వితంతువుగా మారింది. కోడలి పసితనపు బాధను చూసి చలించిన అత్త ప్రతిమ బెహరా కొత్త జీవితం అందించాలని నిర్ణయించుకుంది.
వితంతువైన తన కోడల్ని వివాహం చేసుకోవాలని తన బంధువు కుమారుడు సంగ్రామ్‌ను ఒప్పించింది. అనుగుల్‌లోని జగన్నాథ ఆలయంలో లిల్లి తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిపించి అరుదైన అత్తగా ప్రశంసలు అందుకుంది. సొంత కూతురి మాదిరిగా వితంతువైన కోడలిని మళ్లీ ముత్తయిదువుగా మార్చి అన్ని సంప్రదాయాలతో అత్తారింటికి పంపింది. శభాష్ అత్తమ్మ!