టోల్ ట్యాక్స్ ను పెంచుతూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం పై అప్పుడే పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన మోడీ సర్కార్ ఇప్పుడు టోల్ ట్యాక్స్ ను పెంచడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలనుకుంటున్న టోల్ ట్యాక్స్ ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గడ్కరీకి లేఖను పంపారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై సెస్ వసూలు చేస్తుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
టోల్ ట్యాక్స్ పెంచే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాలని కోరారు. ఇప్పటికే వసూలు చేస్తోన్న టోల్ చార్జీలు ప్రజలకు పెనుభారంగా మారాయని ఆయన అన్నారు. బీజేపీ సర్కార్ ఈ తొమ్మిదేళ్లలో టోల్ చార్జీలను 300 శాతం పెంచిందని విమర్శించారు.
దీంతో మధ్య తరగతి పై చాలా భారం పడుతుందన్నారు. 2014 లో తెలంగాణలో 600 కోట్లు టోల్ ట్యాక్స్ వసూలు చేయగా.. 2023 లో 1,824 కోట్లు వసూలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.