దసరాకు ముందు అగ్రహీరోలంతా తమ సినిమాలతో క్యూకట్టి… మంచి కలెక్షన్లు సంపాదించుకుంటారు. అందుకే దసరాకు సినిమాను రిలీజ్ చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ఉంటారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా అగ్రహీరోల సినిమాల క్యూ లేదు. దాంతో సదరు హీరోల ఫాన్స్ అంతా కాస్త అప్సెట్ అయ్యారు. అయితే, వారిని పండగపూట బాధపెట్టడం ఎందుకు అనుకున్నారో… ఎమో… తమ సినిమా పోస్టర్‌లను విడుదల చేశారు.
దసరా రోజు ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ కాబట్టి… నేతలంతా తమ వర్కింగ్ స్టిల్స్‌ను ఆయుధాలతో రిలీజ్ చేసి, ముగ్గురు హీరోలు సమరానికి సై అన్నారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, ప్రిన్స్ మహేష్, నందమూరి బాలకృష్ణలు ఆయుధాలతో లెటెస్ట్ లుక్‌ను రిలీజ్ చేయటంతో… అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకు ఎవరు’ ఈ సినిమా లో మహేష్ బాబు సైనికుడిగా కనిపించబోతున్నాడు. మనకి సాధారణంగా సైనికుడు అనగానే ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లేదా గన్ లు గుర్తొస్తాయి. కానీ మహేష్ కర్నూల్ కొండా రెడ్డి బూర్జ్ సెంటర్ లో గొడ్డలి పట్టుకుని నిలుచున్న ఫోటోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒక్కడు సినిమా తరువాత కొండా రెడ్డి బూర్జ్ సెంటర్ బ్యాక్ గ్రౌండ్ తో మహేష్ కనిపించటం ఇదే మొదటిసారి.
ఇక మాస్ డైలాగ్‌లకు, యాక్షన్ సీన్‌లతో మెప్పించటంలో నందమూరి బాలకృష్ణ తీరే వేరు. ప్రస్తుతం కే ఎస్ రవికుమార్ దర్శకత్వం లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుంచి ఓ లుక్ ని విడుదల చేశారు. వయస్సు పైబడుతున్నా… తనలో గ్లామర్ ఇంకా తగ్గలేదంటూ స్మార్ట్ లుక్ తో ఇటీవలే ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా పసుపు, కుంకుమ పూసుకుని చేతిలో రక్తంతో తడిచిన కత్తిని పట్టుకుని కనిపిస్తున్న లుక్ నందమూరి అభిమానులను ఆకట్టుకుంటుంది.
త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లుఅర్జున్ నటిస్తున్న సినిమా అల….వైకుంఠపురంలో. త్రివిక్రమ్ అనగానే మనకి గుర్తొచ్చేది పంచ్ డైలాగ్స్, ఫామిలీ సెంటిమెంట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని లుక్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమా కి సంబంధించి అల్లుఅర్జున్ ని కూల్ గా చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు యాక్షన్ బరిలో ఉన్న ఫోటోని రిలీజ్ చేశాడు. స్టైలిష్‌స్టార్ అభిమానులు కూడా అల…వైకుంఠపురం లో లుక్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.