బాక్సాఫీస్ కబ్జా! - tollywood box office facing bad experience in recent times- Tolivelugu

బాక్సాఫీస్ కబ్జా!

శ్రీ రెడ్డి నడి రోడ్ మీద అర్ధనగ్నంగా అన్యాయం జరుగుతోందన్నప్పుడు ఏ గవర్నమెంట్ స్పందించలేదు. సరే…శ్రీ రెడ్డి కాంట్రోవర్సియల్ కాబట్టి వదిలేద్దాము. మరి ఆ తరవాత చాలా మంది వచ్చారు, వేల టీవీ డిబేట్లు, గొడవలు జరిగాక కానీ ఒక కాష్ కమిటీ ఏర్పాటుకాలేదు! ఇప్పుడు ఆ కమిటీ ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. చిత్రపురి కాలనీ చిక్కు ఇప్పటికీ వీడలేదు. జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు అలానే వున్నాయి. రాష్ట్రం విడిపోయాక నంది అవార్డులు ఆంధ్రకి వెళ్లిపోయాయి, ఇక్కడ తెలంగాణా రాష్ట్ర అవార్డులు ఇప్పటికి లేవు! పెద్ద సినిమాలకి ఎన్ని కావాలంటే అన్ని షోలు, చిన్న సినిమాలకి థియేటర్లు కూడా ఉండవు…ఇలా చెప్పుకుపోతుంటే మన సినిమా ఇండస్ట్రీ కష్టాలు…డైలీ సీరియల్ లాగ వేల ఎపిసోడ్ లు సాగుతూనే ఉంటాయి.
అయితే తెలంగాణా ప్రభుత్వం సినిమా ప్రపంచాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుందట. పై సమస్యలకు పరిష్కారం చూపించి కాదు. సినీ పరిశ్రమను తినేస్తున్న ఇంకో పెద్ద ఆటంకాన్ని తొలగించి! సినిమా ప్రపంచంలో ప్రతి శుక్రవారం ఒక స్టార్ పుడతాడు. ఆ స్టార్ వెనుక కొన్ని లక్షల టిక్కెట్లు ఉంటాయి. బ్లాక్ టిక్కెట్ల గోల సినిమా పుట్టినప్పటినుంచి ఉంది. ఈ మధ్య…అనేక ఈ-టిక్కెటింగ్ సైట్లు వచ్చి ప్రజల మీద ఆ భారం తగ్గించారని అనుకున్నాము. కానీ ఇన్సైడ్ కథ అది కాదట!
ఆన్ లైన్ లో ప్రస్తుతం టికెట్లు విక్రయిస్తున్న సంస్థలు మోసాలకు పాల్పడుతూ, రకరకాల టాక్స్ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయట. అందుకే తక్షణమే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఇక మీద తెలంగాణా రాష్ట్రంలో అన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మబోతోందని ఫిలింనగర్ సర్కిళ్లలో తెగ చర్చ జరుగుతోంది.
అయితే, ఇందులో కూడా ఎదో మతలబు ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీలో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ అధికారికంగా ప్రభుత్వమే చేస్తున్నా…. దాన్ని అవుట్ సోర్సింగ్ విధానంలో ఓ ప్రైవేటు ఆన్ లైన్ బస్ బుకింగ్ సంస్థకే కట్టబెట్టారు. గతంలో కేటీఆర్ సన్నిహితులు కొన్ని ప్రైవేటు కార్యక్రమాల టికెట్లు, ఐపిఎల్ లో హైదరాబాద్ టీం టికెట్లు ఆన్ లైన్ లో అమ్మే బిజినెస్ చేశారు. సో… సినిమా టిక్కెట్లు కూడా బస్ బుకింగ్ లాగే అవుట్ సోర్సింగ్ పద్దతిలో కేటీఆర్ సన్నిహితులకు కట్టబెట్టే అవకావశం ఉందని ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే ప్రబుత్వంపై పోరాటం చేస్తామంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
ఏది ఏమయినా…అదే పెద్ద మనసుతో మిగతా సమస్యలను కూడా తెలంగాణా ప్రభుత్వం పరిష్కరిస్తుందని కొంతమంది ఆశావాదుల ఆశ!

Share on facebook
Share on twitter
Share on whatsapp