నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నారు హాస్యబ్రహ్మ జంధ్యాల. తెలుగు ప్రజలు హాస్యం అంటే పడిచస్తారు. కొందరు మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తూ ఉంటుంది. సామెతలు, సూక్తులు, ఘాటు, మోటు వెటకారాల వ్యాఖ్యలతో తెలుగు హాస్యం చిందులేస్తుంటుంది.
తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటీనటులకు కొదవలేదు. రేలంగి నుంచి వెన్నెల కిషోర్, సూర్యకాంతం నుంచి గీతాసింగ్ వరకు ఎందరో దిగ్గజాలు ఉన్నారు. అలాంటివారి కోవలోనే కమెడియన్ వేణు మాధవ్ తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇక ఇటీవల ఆయన అకాల మరణం అటు చిత్రసీమను.. ఇటు అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులందరూ సంతాపం వ్యక్తం చేశారు.