కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు సంక్షోభం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లు మూతపడటమే కాకుండా షూటింగ్ లు సైతం నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది సినీ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇటీవల షూటింగ్ లకు పర్మిషన్లు రావడంతో సినిమా షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది షూటింగులకు వచ్చే సమయంలో కరోనా బారిన పడుతున్నారు. దీనితో సీరియల్స్, సినిమాల షూటింగులు ఆగిపోతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న నిర్మాతలు మరింత నష్టపోతున్నారు.
అయితే సినీ కార్మికుల కష్టాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు సినీ కార్మికులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి టీకా లను వెంటనే వేసే ఏర్పాటు చేయాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శులు తుమ్మల ప్రసన్నకుమార్ మోహన్ వడ్లపట్ల కోరారు. హెల్త్ కేర్ వర్కర్లు, పోలీసులు, టీచర్ల తో పాటుగా సినీ రంగానికి చెందిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని అన్నారు. ఈ మేర ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ లకు లేఖలు రాశారు.