తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసిన డ్రగ్స్ కేసు కంచికి చేరినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో కొంత మందికి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మూడేళ్ల క్రితం కేసు నమోదు చేసి రెండు దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణలో ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో ఈ కేసును క్లోజ్ చేసే ప్రక్రియ మొదలైంది.
2017 జులైలో కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తి మత్తుమందులతో ఆబ్కారీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో కెల్విన్ పై కేసు నమోదు చేసిన ఆబ్కారీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. కెల్విన్ టాలీవుడ్ లో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నానని చెప్పడంతో.. ఈ కేసు సంచలనంగా మారింది.
దీంతో, ఈ కేసు విచారించేందుకు ఆబ్కారీ అధికారులు ఓ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి.. దర్యాప్తు చేశారు. రవితేజ, రాణా, ఛార్మి, తరుణ్ వంటి టాలీవుడ్ ప్రముఖులను పిలిపించుకొని అన్ని కోణాల్లో అధికారులు దర్యాప్తు చేశారు. అయితే, ఎలాంటి ఆధారాలు లభించలేదు. తరువాత ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. డ్రగ్స్ దిగుమతితోపాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. 12 మంది టాలీవుడ్ ప్రముఖులను పిలిచి ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకూ విచారణ చేశారు. అయినప్పటికీ.. డ్రగ్స్ వాడకం గురించి కాని.. దిగుమతి, నిధుల మళ్లింపు గురించి కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసు ఫైల్ ను మూసివేసే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.