ఈ ఏడాది టాలీవుడ్ కు సంక్రాంతి సీజన్ కలిసిరాలేదు. ఇక మిగిలింది సమ్మర్ సీజన్ మాత్రమే. మరీ ముఖ్యంగా 3 నెలలు మాత్రమే టాలీవుడ్ కు అత్యంత కీలకం. ఆ 3 నెలలు క్లిక్ అయితే, ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో నిలిచిపోతుంది. క్లిక్ అవ్వకపోతే మాత్రం నష్టాల్లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది. ఆ మూడు నెలలు మార్చి, ఏప్రిల్, మే.
దాదాపు రెండేళ్లుగా వాయిదా పడుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ అన్నీ ఈ 3 నెలల్లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మార్చి నెలలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు రాబోతున్నాయి. మార్చి ప్రారంభంలో రాధేశ్యామ్, చివర్లో ఆర్ఆర్ఆర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలూ కచ్చితంగా హిట్టవ్వాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు.
ఇక ఏప్రిల్ లో ఏకంగా 3 సినిమాలున్నాయి. అవే భీమ్లానాయక్, ఆచార్య, కేజీఎఫ్-2. ఫిబ్రవరి 25న రావాల్సిన భీమ్లానాయక్ ఏప్రిల్ కు వాయిదా పడేలా ఉంది. అటు ఆచార్య, కేజీఎఫ్-2 ఎలాగూ ఏప్రిల్ కే షెడ్యూల్ అయి ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ లో భారీ సినిమాల జాతర కనిపిస్తోంది. ఇవన్నీ వేటికవే పెద్ద సినిమాలనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక మే నెలలో ఎఫ్3, సర్కారువారి పాట సినిమాలు వస్తున్నాయి. వెంకీ-వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమాపై, మహేష్ నుంచి వస్తున్న సర్కారువారిపాట సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ రెండూ భారీ బడ్జెట్ సినిమాలు కూడా. ఇలా టాలీవుడ్ లో ఈ 3 నెలల్లోనే బడా సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ జాతకాన్ని తేల్చబోతున్నాయి.