టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికులకు జీతాలు పెంచడంతో సమ్మెను విరమిస్తున్నట్టు కార్మికులు ప్రకటించారు. దీంతో రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ లు జరుగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే.. పెంచిన జీతాలు శుక్రవారం నుండి అమలు చేస్తామని ఫెడరేషన్ పేర్కొంది.
విధి విధానాలపై చర్చలు జరుగుతాయని ఫెడరేషన్ పెద్దలు తెలిపారు. జీతం ఎంత పెంచాలన్న దానిపై రేపు చర్చించి నిర్ణయిస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది. పెంచిన జీతాలు చెల్లించే బాధ్యత ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్లదేనని నిర్మాతలు స్పష్టం చేశారు.
అంతకుముందు నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ నాయకులు వేర్వేరుగా మంత్రి తలసానిని కలిశారు. ఈ క్రమంలోనే పంతాలు, పట్టింపులు వద్దని ఇరుపక్షాలకు చెప్పినట్టుగా మంత్రి తలసాని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని చెప్పారు. కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించామని తెలిపారు మంత్రి.
మంత్రి తలసాని సూచనలతో ఫిలిం ఫెడరేషన్ నాయకులతో.. నిర్మాతలు చర్చలు జరపుతున్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి ప్రధానంగా చర్చ సాగుతుంది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
ఇక.. నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని.. పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం తలకు మించిన భారమైపోతోందని వాపోతున్నారు సినీ కార్మికులు.