చెన్నై: టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ ఇక లేరు. 82 ఏళ్ల శ్రీను మాస్టర్ చెన్నైలోని టి నగర్‌లో స్వగృహంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీను మాస్టర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన శ్రీను మాస్టర్ నటశేఖర కృష్ణ నటించిన ‘నేనంటే నేనే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఎన్నో విజయవంతమైన పాటలకు నృత్య దర్శకత్వం వహించారు.
ఎన్టీఅర్ యమగోల మూవీలో ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా’ లాంటి హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసింది శ్రీను మాస్టరే. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా శ్రీను మాస్టర్ పనిచేశారు. 1970, 80లలో సినీ పరిశ్రమలో వైవిధ్య భరితమైన స్టెప్పులతో పాటలను తెరకెక్కించడంలో శ్రీను మాస్టర్ సక్సెస్ అయ్యారు. విజయవంతమైన కొరియోగ్రాఫర్‌గా శ్రీను మాస్టర్ పేరు తెచ్చుకున్నారు. స్వర్ణకమలం, శ్రీరామరాజ్యం, రాధాగోపాలం సినిమాలకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డులను పొందారు.