టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. సీనియర్ డైరెక్టర్ సాగర్ గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న సాగర్ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 30కిపైగా సినిమాలకు సాగర్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో అగ్ర దర్శకులుగా పేరుతెచ్చుకున్న వీవీ వినాయక్, శ్రీనువైట్ల సాగర్ వద్ద శిష్యరికం చేయడం గమనార్హం.
మహ్మద్ బిన్ తుగ్లక్ సినిమాతో సహాయ దర్శకుడిగా సాగర్ సినీ కెరీర్ ఆరంభమైంది. నీడలేని ఆడది, నాయుడి గారి అబ్బాయితో పాటు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1983లో నరేష్, విజయశాంతి కాంబినేషన్‌లో రూపొందిన రాకసిలోయ సినిమాతో దర్శకుడిగా సాగర్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు.
డాకు, స్టూవర్డ్‌పురం దొంగలు సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. సుమన్ హీరోగా సాగర్ దర్శకత్వంలో రూపొందిన రామసక్కనోడు సినిమా మూడు నంది అవార్డులను సొంతం చేసుకున్నది.
కృష్ణ, సాగర్ కాంబినేషన్‌లో రూపొందిన అమ్మదొంగ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దాడి, అమ్మ అమ్మను చూడాలని ఉంది, జగదేక వీరుడు, అన్వేషణ, యాక్షన్ నంబర్ వన్, ఖైదీ బ్రదర్స్, చార్మినార్‌తో పాటు సాగర్ రూపొందించిన పలు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి.
టాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా సాగర్ పనిచేశాడు. సాగర్ మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.