పదేళ్ల తర్వాత చిరంజీవి రీఎంట్రీ, తమిళ సినిమా రీమేక్. ఏడాదిన్నర తర్వాత చిరు తమ్ముడు పవన్ రీఎంట్రీ, మరో సినిమా రీమేక్. చరణ్ కి చేంజ్ ఓవర్ కావాలి మళ్లీ రీమేక్. వెంకటేష్ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అవ్వాలి, రీమేక్ రెడీ. వరస ఫ్లాప్స్ లో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మొదటి సక్సస్ కావాలి, దానిదేముంది మంచి హిట్ సినిమా చూసి రీమేక్ చేస్తే అయిపోయే… ఇలా హిట్ కావాలి అనుకున్న చిన్నా పెద్ద హీరోలంతా కలిసి ఎక్కడ ఏ సినిమా హిట్ అయినా దాన్ని రీమేక్ చేస్తున్నారు. అసలు ఈ రీమేక్ ల గోలేంటో అర్ధం కావట్లేదు. ఇక్కడ కథలేవో, లేక వారిని మెప్పించే స్థాయిలో కథలు రాయట్లేదో తెలియట్లేదు కానీ పరభాషా చిత్రాలు రీమేక్ అవుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.
రీఎంట్రీ కోసం చిరు నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా దళపతి విజయ్ నటించిన కత్తి రీమేక్. టీజర్ తో సౌత్ సెన్సేషన్ గా నిలిచిన కత్తి సినిమా చూడని ప్రేక్షకుడు ఉండడు. అనిరుద్ కత్తికి ఇచ్చిన థీమ్ మ్యూజిక్ నే రింగ్ టోన్స్ గా పెట్టుకోని తిరిగిన తెలుగు యూత్ ఎంతో మంది ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాని, తెలుగులో అదే పేరుతో నాగచైతన్య రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. అయితే చైతన్య సినిమా బయటకి రావడం కన్నా ముందే, ప్రేమమ్ స్టైల్ అంటూ కాలేజ్ స్టూడెంట్స్ అంతా నల్ల చొక్కా, తెల్ల లుంగీ కట్టుకోని తిరిగారు అంటే ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని ఎంత మంది చూసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఈ రెండు సినిమాలే కాదు గత ఐదారేళ్లలో తెలుగులో రీమేక్ అయిన ప్రతి సినిమాని మన ప్రేక్షకులు ముందే చూశారు.
ఒకప్పుడు అంటే ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చేస్తే అవి హిట్ అయ్యేవి. ఇప్పుడు అలా కాదు, అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ రావడంతో ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా, అది బాగుంది అనే టాక్ వస్తే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సినిమా చూసేస్తున్నారు. చేతిలో ఫోన్, దానికి నెట్ ఉంటే చాలు నెలకి 90 నుంచి 300 పెడితే చాలు ఏ బాషా సినిమా అయినా చూసేయొచ్చు. ఇంతటి డిజిటల్ యుగంలో ఒక చిత్రం బాగుంది అని టాక్ వస్తే, దాన్ని సినీ అభిమానులు చూడకుండా ఉంటారు అనుకోవడం నిజంగా ఇండస్ట్రీ వర్గాల భ్రమే అనుకోవాలి. పరభాషలో హిట్ అయిన చిత్రాలని రీమేక్ చేయడం మానేసి, ఒరిజినల్ గా సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది.
ఒరిజినల్ సినిమాలని రీమేక్ చేసే వాళ్లే కాకుండా ఇండస్ట్రీలో మరి కొంత మంది ఉన్నారు. వీళ్లు తెలుగులో డబ్ అయినా కూడా పట్టించుకోకుండా రీమేక్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు, మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లూసిఫర్ రీమేక్ లు ఈ కోవలోకి వచ్చేవే.