స్టార్ హీరో సినిమాలు వస్తున్నాయని తెలిస్తే చాలు అభిమానుల ఆసక్తి, ఆనందం కలగలిసిపోతాయి. సదరు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయంటే వారికి పట్టలేని సంతోషం. అప్పటిదాకా థియేటర్ మొహం చూడని ఆడియన్స్ సైతం పండుగ పేరుచెప్పి ఇంటి నుంచి సినిమాహాల్లో అడుగుపెడతారు.
ఈ సంక్రాంతికి అలాంటి మేజిక్ మరో సారి జరిగింది. చిరు, బాలయ్యలు సంక్రాంతి బరిలోకి దూకారు. చిరు వింటేజ్ స్టైల్ ని చూపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’గా విజిలేయిస్తే..బాలయ్య ‘వీరసింహా రెడ్డిగా’ అభిమానులు మీసం మెలేసేలా చేసాడు. వీరిద్దరు విడివిడిగా వస్తున్నారంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
అలాంటిది ఒక రోజు తేడాలో ఒకేసారి సంక్రాంతి సందడి పంచుతోంటే విషయం మామూలుగా ఉంటుందా..! అభిమానంతో పాటు ట్రేడ్ లెక్కలు,రికార్డులు…రెక్కలు కట్టుకొస్తాయి. నెంబరాఫ్ థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్, ఓవర్సీస్ కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ అబ్బో ..! ఇలా సినిమాల చుట్టూ మూములు ఎనాలసిస్ లు ఉండవు.
ఈ కలెక్షన్ పోటీలో చిరు,బాలయ్యలలో ఎవరూ తగ్గకుండా ఆడియన్స్ కి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ మూలవిరాట్ లని తమకి నచ్చిన వింటేజ్ లుక్స్ లో చూడటానికి మెగా,నందమూరి అభిమానులు థియేటర్స్ కి రిపీట్ మోడ్ లో వెళ్తున్నారు.
దీంతో మొదటి మూడు నాలుగు రోజుల్లోనే ఈ సినిమాలు సెంచరీ కొట్టాయి. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ ని రాబడితే, చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.
ఇది నిజంగా మెగాస్టార్ మాస్ స్ట్రెంత్ అనే చెప్పాలి. ఇది పక్కనపెడితే చిరు-బాలయ్యలు కలిసి ఈ సంక్రాంతి సీజన్లో కేవలం మూడు రోజుల్లోనే 212 కోట్లని రాబట్టారు. రీజనల్ సినిమా పాయింట్ తో యావరేజ్ కంటెంట్ తో, నాన్ – స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి కూడా బాల కృష్ణ, చిరంజీవి ఈ రేంజి కలెక్షన్స్ ని రాబడుతున్నారు అంటే అది పూర్తిగా వారి బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం.
యంగ్ హీరోలకి కూడా పోటీ ఇచ్చేలా ఉన్న చిరు,బాలయ్యలు సాలిడ్ హిట్ కొట్టి 2023లో టాలీవుడ్ కి భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. ఇదే జోష్ ని రాబోయే సినిమాలు కూడా కంటిన్యూ చేస్తే టాలీవుడ్ ఖాతాలో మరో హిట్ ఇయర్ నమోదైనట్లే.