స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టార్చ్ బేరర్‌గా మారాడు. ఇతర సినీ పరిశ్రమల్లో తెలుగు మార్కెట్‌ని ఓపెన్ చేసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ముఖ్యంగా ఇటీవల పుష్ప: ది రైజ్ సినిమాతో బన్నీ సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా విడుదలైన తర్వాత బన్నీ బాలీవుడ్ లో ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల నుంచి పసిపిల్లల వరకు అందరూ అల్లు అర్జున్ నటనను మెచ్చుకున్నారు.
అంతే కాదు చాలా మంది దేశీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు ఆ సినిమాకు సంబంధించిన రీల్స్ చేసి అల్లు అర్జున్‌కి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చారు. ఒక్క బాలీవుడ్ లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ ఓపెన్ చేసిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇప్పటి వరకు నిర్మాతలు కొన్ని పాన్-ఇండియన్ సినిమాలను మాత్రమే ప్లాన్ చేసి హిందీలో విడుదల చేశారు. మరికొంత మంది కేవలం హిందీలో తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కులను మాత్రమే విక్రయించి థియేటర్లలో విడుదలకు దూరంగా ఉండేవారు.
కానీ పుష్ప: ది రైజ్ తర్వాత, హీరోలు తమ చిత్రాలను హిందీలో కూడా విడుదల చేయాలని నిర్మాతలను కోరుతున్నారు. కారణం అల్లు అర్జున్. పుష్ప: ది రైజ్ చిత్రాన్ని ప్రమోట్ చేసిన విధానంఅందరి దృష్టిని ఆకర్షించింది. హిందీలో వచ్చిన వసూళ్లను చూసి ప్రతి హీరో బాలీవుడ్ మార్కెట్ కోసం కలలు కంటున్నారు. గతంలో మలయాళంలో తెలుగు సినిమాల మార్కెట్‌ను ఓపెన్ చేసిన ఏకైక హీరో అల్లు అర్జున్.
కేరళలో ఆయన సినిమాలకు భారీ మార్కెట్ ఉంది. బన్నీకి హిందీ మార్కెట్ కూడా ఉంది. కానీ పుష్ప తర్వాత అది మళ్లీ పెరిగింది. ఇక పుష్ప 2 రాకతో మార్కెట్ మరింత పెరగడం ఖాయం అనే అనిపిస్తుంది. హిందీలోనే కాదు, నేపాల్, బెంగాల్ వంటి భాషల్లోనూ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బన్నీ ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడయ్యాడు. ప్రభాస్ తర్వాత, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల మార్క్‌ను దాటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ఏకైక టాలీవుడ్ నటుడిగా అల్లు అర్జున్ రికార్డుకెక్కాడు.