కేరళలో ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసులు, షిగెల్లా, ఎబోలా లాంటి ఇతర వైరస్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో టొమాటో ఫ్లూ వైరస్ బయటపడటం అధికారులను కలవరపెడుతోంది.
కేరళలో 80 మంది పిల్లల్లో ఈ టొమాటో ఫ్లూ వైరస్ ను గుర్తించినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిలో అత్యధింగా ఐదేండ్లలోపు పిల్లలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
సరిహద్దు రాష్ట్రం కేరళ నుంచి వచ్చిన కొందరిలో టొమాటో ఫ్లూ గుర్తించినట్టు తమిళనాడు అధికారులు తెలిపారు. దీంతో కేరళ నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసు, వైద్య, రెవెన్యూ అధికారుల బృందాలను నియమించినట్టు తమిళనాడు అధికారులు తెలిపారు. కేసుల నేపథ్యంలో ఇటు కేరళ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు.
టొమాటో ఫ్లూ అనేది అరుదుగా వచ్చే వైరల్ జ్వరం. ఇది ఐదేండ్ల లోపు పిల్లలకు సోకుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫ్లూ వచ్చిన వారిలో శరీరంపై దద్దుర్లు, చర్మంపై దురద, తీవ్రమైన జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు.