పప్పు టమాటో, వంకాయ టమాటో, దోసకాయ టమాటో, చిక్కుడు కాయ టమాటో, బెండకాయ టమాటో… ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి కూరగాయతోనూ కలిపి వండే ఏకైక కూరగాయ టమాటో. కూరగాయల్లో రారాజుగా టమాటోను వర్ణించవచ్చు. భారతీయ వంటకాల్లోనే కాకుండా.. దాదాపు ప్రపంచ దేశాల ప్రజల ఆహారంలో అత్యధికంగా వినియోగించే కూరగాయ టమాటో. అలాంటి టమాటా కొన్ని రోజులకు కనుమరుగవుతుందంటే నమ్మగలమా..?
అవునండీ.. రోజురోజుకీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బ తీస్తోందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ప్రభావం మన నెంబర్ వన్ కూరగాయ టమాటో మీద కూడా తీవ్రంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. టమాటోలు లేని ప్రపంచాన్ని త్వరలోనే చూడబోనున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు.
రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల వేడి, వాతావరణంలో మార్పులతో రాబోయే కాలంలో ప్రపంచ టమాటోల పంటపై తీవ్ర ప్రభావం చూపుతోందని వెల్లడైంది. డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వ విద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విషయాన్ని వివరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు టమాటోల ఉత్పత్తి పై ఎలా ప్రభావం చూపిస్తాయో అని అంచనా వేయడానికి పునరుత్పత్తి చేయబడిన గణిత నమూనాను రూపొందించారు.
ఇటలీ, చైనా, కాలిఫోర్నియా దేశాలు టమాటా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని వారు చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా టమాటో ఉత్పత్తి ఇక్కడే జరుగుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న వేడి వల్ల 2050 నుంచి 2100 మధ్య టమాటో పంట సగానికి తగ్గిపోతుందని పరిశోధకులు కనుగొన్నారు.ఇప్పటికే భారత్‌లో పెరిగిన వడగాలులు వల్ల టమాటా ఉత్పత్తి తగ్గి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.