ఏవరైనా రాజకీయ నాయకుడు ఓ ప్రాంతానికి వెళ్తున్నారంటే మన దగ్గర హడావుడి ఎలా ఉంటుందో తెలుసు. పోలీసులు, అధికారులు, అనుచరులు, పార్టీ నాయకులు.. ఇలా సందడిగా ఉంటుంది. అదే ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అయితే మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తారు. ఎవర్నీ దరిదాపుల్లోకి రానివ్వరు. కానీ.. కొన్ని దేశాల్లో అధ్యక్షులు, ప్రధాన మంత్రులు అప్పుడప్పుడు రోడ్లపైకి సడెన్ ఎంట్రీ ఇస్తుంటారు. సామాన్యుల మాదిరి ప్రజల దగ్గరకు వెళ్లి కబుర్లు చెప్తుంటారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లారు. కాకపోతే.. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో విజయం తర్వాత మొదటిసారి మాక్రాన్ జనంలోకి వచ్చారు. ప్రజలంతా ఆయన్ను చుట్టుముట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనాల అభిమానాన్ని చూసి మాక్రాన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా ఓ వ్యక్తి టమాటాలు విసిరాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి వలయంలా నిలబడ్డారు. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లారు.
2017 ఎన్నికల్లో గెలిచిన మాక్రాన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ లో మరోసారి గెలిచి తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు.