భారతీయ చిత్ర పరిశ్రమ చాలా పెద్దది. అందులో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇతర ఇండస్ట్రీల కన్నా ఎంతో పేరుగాంచింది. ఆ సినిమాలకు మార్కెట్ పరిధి ఎక్కువ. దీంతో బాలీవుడ్‌లో ఏదైనా సినిమా హిట్ అయితే చిత్ర వర్గాలకు కాసులు కురుస్తాయి. ముఖ్యంగా నటీనటులకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి. అందుకనే చాలా మంది ఇతర ఇండస్ట్రీలకు చెందిన వారు బాలీవుడ్ వైపు కన్నేస్తుంటారు. అయితే ఎంత మంది వచ్చినా బాలీవుడ్‌లో కొందరు అగ్ర నటులదే ఆధిపత్యం ఉంటుంది. వారు తమ సినిమాల ద్వారా బాలీవుడ్‌ను ఎప్పటి నుంచో ఏలుతున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడుతున్నారు. రికార్డులను తిరగరాస్తున్నారు. ఈ క్రమంలోనే 1947 నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని బాలీవుడ్ సినిమాల్లో ఏ హీరోకు చెందిన సినిమాలు ఎక్కువ కలెక్షన్లను రాబట్టాయి, ఈ జాబితాలో ఎవరు అగ్ర స్థానంలో నిలిచారు ? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
సల్మాన్‌ఖాన్…
బాలీవుడ్ చరిత్రలో సల్మాన్‌ఖాన్‌కు చెందిన చిత్రాలే ఎక్కువ కలెక్షన్లను రాబట్టాయి. 30 ఏళ్ల కెరీర్‌లో సల్మాన్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. సల్మాన్ కు చెందిన మొత్తం 10 చిత్రాలు ఆయా సంవత్సరాలకు గాను అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. వాటిల్లో మైనే ప్యార్ కియా, సాజన్, హమ్ ఆప్‌కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, నో ఎంట్రీ, దబాంగ్, బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, భజ్‌రంగీ భాయీజాన్, టైగర్ జిందా హై చిత్రాలు అత్యధిక కలెక్షన్లను రాబట్టాయి. దీంతో సల్మాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు.
దిలీప్‌కుమార్…
బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన పలు చిత్రాల్లో దిలీప్ కుమార్ కూడా నటించారు. ఆయనకు చెందిన 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. జుగ్ను, షాహీద్, ఆన్, మధుమతి, ముగల్-ఇ-అజమ్, గంగా జమున, క్రాంతి, విధాత, కర్మ చిత్రాలు ఆయన ఖాతాలో ఉండగా.. ఆ జాబితాలో ఈయన రెండో స్థానంలో నిలిచారు.
అమీన్‌ఖాన్…
అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో నటించిన నటుల జాబితాలో అమీర్‌ఖాన్ 3వ స్థానంలో నిలిచాడు. 32 ఏళ్ల కెరీర్ అమీర్‌ఖాన్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. కానీ దిల్, రాజా హిందుస్థానీ, గజిని, 3 ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్ చిత్రాలు అధిక కలెక్షన్లను రాబట్టాయి.
అమితాబ్ బచ్చన్…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ 6 అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాల్లో నటించారు. అందువల్ల ఈయన ఆ జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. రోటీ కప్‌డా ఔర్ మకాన్, షోలే, అమర్ అక్బర్ ఆంథోనీ, ముకద్దర్ కా సికందర్, సుహాగ్, కూలీ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు.
షారూఖ్‌ఖాన్, రాజ్ కపూర్, ధర్మేంద్ర…
అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాల్లో నటించిన వారిలో షారూఖ్ ఖాన్, రాజ్‌కపూర్, ధర్మేంద్రలు ముగ్గూరు 5వ స్థానంలో నిలిచారు. వీరు ఒక్కొక్కరు 5 అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో నటించారు. పథ్థర్ కా ఫూల్, ఆంఖే, సీతా ఔర్ గీతా, షోలే, హుకుమత్ చిత్రాల్లో ధర్మేంద్ర నటించగా, దిల్‌వాలే దిల్హనియా లే జాయెంగె, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, వీర్ జారా, ఓం శాంతి ఓం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో షారూఖ్ నటించాడు. ఇక రాజ్ కపూర్.. బర్సాత్, ఆవారా, శ్రీ 420, అనారి, సంగం తదితర హిట్ చిత్రాల్లో నటించారు.
హృతిక్ రోషన్…
గత 20 ఏళ్లుగా హృతిక్ రోషన్ కూడా పలు హిట్ చిత్రాల్లో నటించాడు. అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రాలు ఇతని ఖాతాలో 4 ఉన్నాయి. దీంతో హృతిక్ ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. కహో నా ప్యార్ హై, కోయి మిల్ గయా, ధూమ్ 2, వార్ చిత్రాల్లో హృతిక్ నటించాడు. ఇవి ఆయా సంవత్సరాలకు అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రాలుగా నిలిచాయి.
ఇక ఈ జాబితాలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, గోవిందా, సన్నీ డియోల్ కూడా వరుస స్థానాల్లో నిలిచారు.