కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా..దేశీయ ఐటీ రంగం మాత్రం దూసుకుపోతోంది. రానున్న ఆర్థిక సంవత్సరం (2021-22)లో దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో గతంలో కంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మొత్తం ఈ నాలుగు కంపెనీలు కలిసి క్యాంపస్‌ల నుంచి 91వేల మంది కొత్తవారికి కొలువులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 40వేల మందిని తీసుకోగా.. వచ్చే ఏడాది కూడా అదే స్థాయిలో నియామకాలు చేపట్టనుంది. ఇక ఇన్ఫోసిస్ వచ్చే ఆర్థిక సంవత్సరం 24వేల మందిని తీసుకోవాలని భావిస్తోంది. ఇక హెచ్‌సీఎల్ 15వేల మందిని, విప్రో 12వేల మందికి అవకాశం కల్పించనుంది. ఇందులో ఇండియాలోనే పనిచేసేందుకు 90 శాత మందిని తీసుకుంటుండగా.. 10 శాతం ఉద్యోగులను ఇతర దేశాల కోసం నియమించుకోనుంది.
భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి కారణం.. ఆయా కంపెనీలకు భారీ డీల్స్ దక్కడమేనని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌కు జర్మనీ ఆటో రంగ దిగ్గజం డైమ్లర్ నుంచి పెద్ద డీల్ కుదిరింది. ఇక టీసీఎస్‌కు ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌తో ఒప్పందం కుదరగా.. విప్రోకు జర్మనీ రిటైలర్ మెట్రో నుంచి డీల్ దక్కినట్టుగా నిపుణులు చెబుతున్నారు.