పార్లమెంట్ ఎన్నికల్లో టార్చ్‌లైట్ గుర్తు కేటాయించి.. అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీకి ఆ గుర్తును అలాట్ చేయడంపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయన ఎన్నికల సంఘం గడప తొక్కారు. తమ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టార్చ్‌లైట్ గుర్తు కేటాయించాలని కోరారు. ఈసీ నిర్ణయం కారణంగా తమ పార్టీ నష్టం కలుగుతుందని వారి దృష్టికి తీసుకెళ్లారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్ గుర్తును కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు టార్చ్‌లైట్లు చేత పట్టుకుని తిరిగారు. కమల్ హాసన్ పార్టీ గుర్తు టార్చ్‌లైట్ అంటూ తీవ్రంగా ప్రచారం చేశారు. తీరా ఇటీవల టార్చ్ లైట్ గుర్తును తమకు కాకుండా.. ఎంజీఆర్ మక్కల్ కట్చి పార్టీకి కేటాయించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకుంటే.. న్యాయం పోరాటం చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నారు.